
శివయ్య ఆలయాన్ని ముంచెత్తిన గంగమ్మ
ద్వారకాతిరుమల: తిరుమలంపాలెంలో శ్రీ భ్రమరాంబ ఆది మల్లేశ్వర స్వామి ఆలయాన్ని గంగమ్మ ముంచెత్తింది. సోమవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం కారణంగా ఆలయ ఆవరణలోకి, అలాగే శివయ్య, అమ్మవారి గర్భాలయాల్లోకి భారీగా నీరు చేరింది. పురోహితుడు ఆ నీటిలోంచే స్వామి, అమ్మవార్లకు పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంతం లోతట్టుగా ఉండటం వల్ల వర్షపు నీరు ఆలయంలోకి చేరుతోందని, ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.
పోలవరం రూరల్: గోదావరి వరద ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు నదిలో నీటి ప్రవాహం పెరుగుతుండటంతో వరద ఉద్ధృతి పెరిగింది. పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే వద్ద 31.200 మీటర్లకు నీటిమట్టం చేరుకుంది. స్పిల్‌వే 48 గేట్ల నుంచి సుమారు 7 లక్షల క్యూసెక్కుల వరద నీరు దిగువకు చేరుతోంది. ఎగువన భద్రాచలం వద్ద 39.70 అడుగులకు నీటిమట్టం చేరుకుంది. అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు నదిలోకి నీరు చేరడంతో వరద మరో రెండు రోజులు పెరిగే పరిస్థితి ఉందని జలవనరుల శాఖ అధికారులు చెబుతున్నారు.