
అన్నదాతకు అండగా..
నేడు అన్నదాత పోరు
నాలుగు ఎకరాలు సాగు చేస్తున్నాను. ఈ సీజన్‌లో యూరియా దొరకడం చాలా కష్టంగా ఉంది. సొసైటీలు, బయటి దుకాణాల్లో ఎక్కడా స్టాకు లేదంటున్నారు. గతంలో ఎప్పుడూ ఇంత ఇబ్బంది రాలేదు. ఈ తొలకరికే యూరియాకు కొరత వచ్చింది.
– గణపాబత్తుల ఏసుబాబు, గుంపర్రు, యలమంచిలి మండలం
యూరియా మొదటి కోటాకు ఇబ్బంది రాలేదు. ఇప్పుడు రెండో కోటా వేద్దామంటే ఎక్కడా దొరకడం లేదు. ఎరువుల దుకాణంలో ఖాతా ఉంది. అక్కడ లేకపోవడంతో డీలర్ సూచనపై పెనుమంట్ర డీసీఎంఎస్‌కు వస్తే ఇక్కడ స్టాకు లేదని చెప్పారు.
– పి.రాము, రైతు, మాముడూరు, పెనుమంట్ర మండలం
యలమంచిలి మండలంలో మొత్తం 9 సొసైటీలకు గాను కొంతేరు, యలమంచిలి, శిరగాలపల్లి, నారినమెరక, చించినాడ సొసైటీల్లో ఎరువుల విక్రయం చేస్తున్నారు. ఈ సీజన్‌లో యలమంచిలి సొసైటీకి 50 టన్నులు, కొంతేరుకు 36, శిరగాలపల్లికి 80, నారినమెరకకు 36, చించినాడకు 36 టన్నులు వచ్చింది. అరకొర నిల్వలతో స్టాకు వచ్చిన వెంటనే రైతులు ఎగరేసుకుపోతున్నారు. ఒక్కోసారి ఎకరాకు అర బస్తా (22.5 కిలోలు) మాత్రమే ఇస్తున్నట్టుగా రైతులు చెబుతున్నారు. కొంతేరు సొసైటీకి 12.5 టన్నుల వరకు రాగా సోమవారం రైతులు ఎగబడిమరీ తీసుకువెళ్లారు.
పెనుమంట్రలోని డీసీఎంఎస్ గోడౌన్‌కు జూన్ 20న 25.200 టన్నులు, జూలై 23న 25.200 టన్నులు, జూలై 31న 6.300 టన్నుల యూరియా వచ్చింది. వచ్చిన రెండు మూడు రోజుల్లోనే ఈ స్టాకు అయిపోయింది. ఆగస్టు, సెప్టెంబరులో ఇప్పటి వరకు స్టాకు రాలేదని సిబ్బంది చెబుతున్నారు. ఈ–పోస్ యంత్రంలో స్టాకు ఉన్నట్టుగా చూపిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం ప్రైవేట్ డీలర్ల వద్ద కూడా దొరకడం లేదని ఇక్కడి రైతులు అంటున్నారు.
సాక్షి, భీమవరం: జిల్లాలో 2.15 లక్షల ఎకరాల్లో వరి, 25 వేల ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగవుతున్నాయి. వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారం ఖరీఫ్ సీజన్‌కు 21,270 మెట్రిక్ టన్నుల యూరియా అవసరమవుతుంది. ఇప్పటివరకు 20,310 మెట్రిక్ టన్నులు రాగా 18,329 మెట్రిక్ టన్నులు రైతులకు అందజేసినట్టు వ్యవసాయాధికారులు చెబుతున్నారు. ఎరువుల కొరత లేదని, సొసైటీల్లో అవసరమైన యూరియా నిల్వలు ఉన్నాయని.. అధికారులు చేస్తున్న ప్రకటనలకు, క్షేత్రస్థాయిలో పరిస్థితికి పొంతన ఉండటం లేదు. కొన్ని సొసైటీల్లో స్టాకు లేదని సిబ్బంది రైతులను వెనక్కి పంపిస్తున్నారు.
వినియోగం తక్కువే
రబీతో పోలిస్తే ఖరీఫ్‌లో యూరియా వినియోగం తక్కువగా ఉంటుంది. దాళ్వాలో మూడు నుంచి నాలుగు బస్తాలు (ఒక్కో బస్తా 45 కిలోలు) వినియోగిస్తే తొలకరిలో రెండు దఫాలుగా రెండు బస్తాల వరకు మాత్రమే వేస్తుంటారు. ముందుగా నాట్లు జరిగిన తాడేపల్లిగూడెం, తణుకు, ఉండి, భీమవరం నియోజకవర్గాల్లో దాదాపు రెండు కోటాలు పూర్తయ్యాయి. నీటి ఎద్దడి, వర్షాభావ పరిస్థితులతో సాగు ఆలస్యమైన ఆచంట, పాలకొల్లు, నరసాపురం నియోజకవర్గాల్లో చాలాచోట్ల మొదటి కోటా మాత్రమే వేశారు. కొన్ని సొసైటీల్లో యూరియా లభ్యత లేక రైతులు ఇబ్బంది పడుతున్న పరిస్థితులు ఉన్నాయి. యలమంచిలి మండలంలో కొన్నిచోట్ల అర బస్తా మాత్రమే ఇస్తుండగా, పెనుగొండ, ఆచంట మండలాల్లో యూరియాకు కాంప్లెక్స్ ఎరువుల లింక్ పెడుతున్నట్టు రైతులు చెబుతున్నారు.
వైఎస్సార్‌సీపీ పిలుపుతో ఉలికిపాటు
యూరియా కొరత, రైతుల సమస్యల పరిష్కారంలో అలసత్వంపై వైఎస్సార్‌సీపీ ఈ నెల తొమ్మిదో తేదీన అన్నదాత పోరుకు పిలుపునివ్వడం కూటమి ప్రభుత్వానికి మింగుడుపడటం లేదు. సాగుకు ముందే నిల్వలు పక్కదారి పట్టడం ప్రస్తుత దుస్థితికి కారణమని వైఎస్సార్‌సీపీ నేతలు విమర్శిస్తున్నారు. డెల్టా జిల్లాలో యూరియాకు కొరత రావడం ప్రభుత్వ చేతగానితనానికి నిదర్శనమంటూ మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఎరువుల గోడౌన్లు, దుకాణాలపై విజిలెన్స్ తనిఖీలు, కేసుల నమోదు పేరిట ప్రభుత్వం హడావిడి చేస్తోంది. జిల్లాలో 13 (6ఏ) కేసులు నమోదు చేసి రూ.16.86 లక్షల విలువైన 76.65 మెట్రిక్ టన్నుల యూరియాను సీజ్ చేసినట్టు అధికారులు చెబుతున్నారు.
రైతు సంక్షేమాన్ని గాలికొదిలేసిన కూటమి ప్రభుత్వ తీరును నిరసిస్తూ మంగళవారం రైతులతో కలిసి వైఎస్సార్‌సీపీ అన్నదాత పోరు నిర్వహించనుంది. రెవెన్యూ డివిజన్ పరిధిలోని పార్టీ శ్రేణులు, రైతులు ఆర్డీఓ కార్యాలయాలకు చేరుకుని వినతిపత్రాలు అందజేస్తారు. భీమవరం, ఉండి నియోజకవర్గాల నుంచి భీమవరం ఆర్డీఓ కార్యాలయం, తణుకు, తాడేపల్లిగూడెం నుంచి తాడేపల్లిగూడెంలోను, నరసాపురం, ఆచంట, పాలకొల్లు నుంచి నరసాపురంలోను రైతు సమస్యలపై వినతులు ఇస్తారు.
ఎరువుల కొరత లేదంటున్న అధికారులు
యూరియా దొరకడం లేదంటున్న రైతులు
సొసైటీలు, డీలర్ల చుట్టూ ప్రదక్షిణలు
రైతుల పక్షాన నేడు వైఎస్సార్‌సీపీ పోరు
ఆర్డీఓ కార్యాలయాల వద్ద రైతులతో కలసి కార్యక్రమం

అన్నదాతకు అండగా..

అన్నదాతకు అండగా..