
స్కూటీతో నేరుగా ఆస్పత్రి వార్డుల్లోకి..
● ఇష్టానుసారంగా కాంట్రాక్టర్ తీరు
● వైద్యాధికారులు చెప్పినా డోంట్ కేర్
పాలకొల్లు సెంట్రల్ : ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు అందించే ఆహారాన్ని కాంట్రాక్టర్ నేరుగా తన ద్విచక్ర వాహనంతో వార్డుల్లోకి తీసుకువెళ్లి అందించడంపై రోగులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అక్కడున్న ఒక వ్యక్తి ఫొటో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో ఈ విషయం బహిర్గతమైంది. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు ఉదయం టిఫిన్, మధ్యాహ్న, రాత్రి వేళల్లో భోజనం కాంట్రాక్టర్ ద్వారా ఏర్పాటు చేస్తుంటారు. ఈ కాంట్రాక్టర్ గత కొంతకాలంగా ఆహారాన్ని నేరుగా వార్డుల్లోకి తన ద్విచక్ర వాహనంతో వెళ్లి సరఫరా చేస్తుండటం గమనార్హం. ఆస్పత్రి వైద్యాధికారులు ద్విచక్ర వాహనంతో లోపలికి రావద్దని వారించినా, తాను గత కొంతకాలంగా ఇలానే ఇస్తున్నానంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పినట్టు సమాచారం. సోషల్‌మీడియాలో ఈ విషయం వైరల్ కావడంతో ద్విచక్ర వాహనాన్ని వార్డు వద్ద పెట్టి.. లోపలికి పేషెంట్లను తీసుకెళ్లే వీల్ చైర్‌లో పెట్టుకుని తీసుకెళ్లడం గమనార్హం. మరి అత్యవసర సమయంలో వీల్ చైర్ అవసరమైతే ఏం చేస్తారని ఆసుపత్రికి వచ్చిన రోగుల బంధువులు ప్రశ్నిస్తున్నారు. దీనిపై వైధ్యాధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

స్కూటీతో నేరుగా ఆస్పత్రి వార్డుల్లోకి..