
మెడికల్ పింఛన్ అందడం లేదు..
కలెక్టర్‌కు విన్నవించిన దివ్యాంగుడి కుటుంబసభ్యులు
కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ అర్జీల స్వీకరణ కార్యక్రమ ప్రాంగణం వద్ద వీల్‌చైర్‌లో మెలికలు తిరిగిపోతున్న దివ్యాంగుడిని చూసి కలెక్టర్ నాగరాణి చలించిపోయారు. అతని వద్దకు వచ్చి ఏమైందంటూ అతని తల్లిదండ్రులను ఆరా తీశారు. తమ కుమారుడి పేరు బొడ్డు రాఘవేంద్ర అని, చిన్ననాటి నుంచీ ఇదే పరిస్థితని ఈ సందర్భంగా వారు కలెక్టర్‌కు వివరించారు. వీల్‌చైర్‌లో కూడా నిలకడగా కూర్చోబెట్టలేని పరిస్థితని తెలిపారు. దివ్యాంగుల పింఛన్ ప్రస్తుతం రూ.6 వేలు అందుతోందని, సదరం సర్టిఫికెట్‌లో అంగవైకల్యం 45 శాతం మాత్రమే నమోదవడంతో మెడికల్ పింఛన్ అందుకోలేకపోతున్నామని వివరించారు. తమ కుమారుడిని చూసుకోవడం చాలా కష్టంగా ఉందని, ఎప్పుడూ ఇద్దరు వ్యక్తులు పనులు మానుకుని దగ్గరుండి చూసుకోవాల్సిన పరిస్థితని వారు వాపోయారు. దీంతో కలెక్టర్ స్పందిస్తూ డీసీహెచ్‌ఎస్‌ని పిలిచి కొత్తగా సదరం సర్టిఫికెట్ మంజూరుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీనిని ప్రత్యేక కేసుగా ప్రభుత్వానికి సిఫార్సు చేస్తూ పంపడానికి ప్రతిపాదన సిద్ధం చేయాలని చెప్పారు. అధైర్యపడొద్దని అతని తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు.