
దొడ్డిపట్ల గోదావరిలో పంటు ప్రారంభం
యలమంచిలి: మండలంలోని దొడ్డిపట్ల వద్ద వశిష్ట గోదావరి నదిలో పంటు ప్రయాణం పునః ప్రారంభమైంది. గత నెల 29న గోదావరిలో వరద నీరు పెరిగి కనకాయలంక కాజ్‌వే మునిగిపోవడంతో అధికారుల ఆదేశాల మేరకు దొడ్డిపట్ల రేవులో పంటు ప్రయాణాన్ని నిలిపివేశారు. 11 రోజుల తరువాత వరద తగ్గి కనకాయలంక కాజ్‌వే వరద నుంచి పూర్తిగా బయటపడడంతో సోమవారం నుంచి పంటు ప్రయాణం ప్రారంభించారు. దీంతో ఉభయ గోదావరి జిల్లాల్లోని డెల్టా, కోనసీమ ప్రజలకు ప్రయాణం సులభతరమైంది.
అర్జీలకు శాశ్వత పరిష్కారం : ఎస్పీ
భీమవరం: ప్రజా ఫిర్యాదులపై నిర్లక్ష్యం వహించకుండా నిర్ణీత గడువులోగా చట్ట పరిధిలో శాశ్వత పరిష్కారం చూపాలని ఎస్పీ అద్నాన్ నయీం అస్మి జిల్లా పోలీసు అధికారులను ఆదేశించారు. సోమవారం భీమవరం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆయన అర్జీలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాలకు చెందిన 13 మంది బాధితులు అర్జీలు అందజేశారు. అర్జీలను స్వీకరించిన అనంతరం సంబంధిత పోలీస్‌స్టేషన్ల అధికారులతో ఆయన ఫోన్‌లో మాట్లాడారు. ప్రజా సమస్యలపై పూర్తిస్థాయి విచారణ జరిపి అర్జీలు తిరిగి పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) వి.భీమారావు, జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ వి.పుల్లారావు, డీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్ దేశంశెట్టి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టరేట్ కోసం 3 రోజుల నిరాహార దీక్ష
భీమవరం (ప్రకాశం చౌక్) : భీమవరం మార్కెట్ యార్డులోనే కలెక్టరేట్ నిర్మించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల తొమ్మిదో తేదీ మంగళవారం నుంచి మూడు రోజులపాటు భీమవరం ప్రకాశం చౌక్ సెంటర్‌లో రిలే నిరాహార దీక్ష చేపట్టనున్నట్టు ప్రముఖ న్యాయవాది, బార్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ జవ్వాది సత్యనారాయణ (సత్తిబాబు) తెలిపారు. పార్టీలకు అతీతంగా భీమవరం పౌరులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆయన కోరారు.
కొనసాగుతున్న యూరియా కష్టాలు
పోలవరం రూరల్: యూరియా కొరత లేదంటూ ప్రభుత్వం చెప్పే లెక్కలకు, క్షేత్రస్థాయిలో పరిస్థితులకు పొంతన లేని పరిస్థితి కనిపిస్తోంది. పోలవరం మండలంలోని కృష్ణారావుపేట, పట్టిసీమ, గూటాల, ప్రగడపల్లి సొసైటీల్లో 50.460 మెట్రిక్ టన్నుల యూరియా ఉన్నట్టు వ్యవసాయశాఖ అదికారులు చెబుతున్నారు. సోమవారం ఉదయం పట్టిసీమ, పోలవరం సొసైటీల వద్ద యూరియా కోసం రైతులు బారులు తీరారు. ఆధార్ కార్డులు పట్టుకుని క్యూ కట్టారు. రైతుకు రెండు బస్తాలు యూరియా వంతున పంపిణీ చేపట్టారు. కొన్ని గంటల్లోనే ఉన్న సరకు అయిపోయింది. దీనిపై రైతులు సిబ్బందిని నిలదీయగా, వాదోపవాదాలు చోటుచేసుకున్నాయి.
ఈ క్రమంలో పోలవరం ఎస్సై ఎస్‌ఎస్ పవన్‌కుమార్ అక్కడికి చేరుకొని రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. క్యూలో ఉన్నవారికి మాత్రమే బస్తాలు ఇవ్వడంతో ఆ తర్వాత వచ్చినవారు మిగిలిపోయారు. మిగిలిన రైతులు సుమారు 150 మంది వరకు ఉండటంతో వారికి వచ్చే కోటాలో యూరియా ఇస్తామని నచ్చజెప్పారు. వారికి స్లిప్పులు ఇచ్చి యూరియా వచ్చిన వెంటనే ముందుగా ఇచ్చేందుకు ఏర్పాటు చేయడంతో రైతులు శాంతించి వెనుదిరిగారు. యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారనడానికి ఇదో తాజా ఉదాహరణ.

అర్జీలకు శాశ్వత పరిష్కారం : ఎస్పీ