
నేరాల నియంత్రణకు ప్రత్యేక ప్రణాళిక
ఏలూరు టౌన్: నేరాల నియంత్రణకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్లాలని ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్‌కుమార్ చెప్పారు. ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో శనివారం ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ అధ్యక్షతన ఏలూరు జిల్లా అర్ధసంవత్సర నేరసమీక్ష, కోఆర్డినేషన్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఏలూరు రేంజ్ ఐజీ మాట్లాడుతూ జిల్లాలోని పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులు, పురోగతి, నిందితుల అరెస్ట్‌లు, కోర్టుల్లో చార్జిషీటు దాఖలు వంటి అంశాలపై పోలీస్ అధికారులు, సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించాలని, బాధితులకు న్యాయం అందించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. వీక్లీ ప్రోగ్రెస్ రిపోర్ట్ తయారు చేసుకుంటే దర్యాప్తు వేగంగా పూర్తి అవుతుందన్నారు. పోక్సో కేసులు, బాలికల మిస్సింగ్ కేసుల్లో 90 శాతం దర్యాప్తు పూర్తి చేయాలని ఆదేశించారు. పోక్సో కేసుల్లో 60 రోజుల్లో కేసులు దర్యాప్తు పూర్తిచేసి చార్జిషీట్‌ను కోర్టులో దాఖలు చేయాలని, నిందితులకు శిక్షలు పడేలా చూడాలన్నారు. ప్రాసిక్యూషన్స్ డిప్యూటీ డైరెక్టర్ ఎం.శారదామణి మాట్లాడుతూ జిల్లాలో కోర్టు మోనిటరింగ్ సెల్‌ను ఏర్పాటు చేసి ఎస్పీ శివకిషోర్ ఎప్పటికప్పుడు దిశా నిర్ధేశం చేయడంతో కేసుల్లో నిందితులకు శిక్షలు పడుతున్నాయని స్పష్టం చేశారు. దర్యాప్తులో పోలీస్ అధికారులు శ్రద్ధ చూపించటంతో ఇటీవల పోక్సో కేసుల్లో కఠిన శిక్షలు పడుతున్నాయని తెలిపారు. రవాణాశాఖ అధికారి కృష్ణారావు మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామన్నారు. ఎస్పీ కేపీ శివకిషోర్ మాట్లాడుతూ జిల్లాలో నేరాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు చేపట్టామని, నేరాలకు పాల్పడితే ఎవరినీ ఉపేక్షించేదిలేదని హెచ్చరించారు. పోలీస్ అధికారులు బాధితులకు న్యాయం అందించేలా మరింత నిబద్ధతతో పనిచేయాలని సూచించారు. సమీక్ష సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు, ఏలూరు జీజీహెచ్ అధికారి జాగీ, ఎక్‌పైజ్ జిల్లా అధికారి ఆవులయ్య, డీఎస్పీలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్‌కుమార్
అర్ధ సంవత్సర నేర సమీక్ష, కోఆర్డినేషన్ సమావేశం