పేరుకే ఉచితం.. దోపిడీ అధనం | - | Sakshi
Sakshi News home page

పేరుకే ఉచితం.. దోపిడీ అధనం

Jul 18 2025 1:27 PM | Updated on Jul 18 2025 1:27 PM

పేరుక

పేరుకే ఉచితం.. దోపిడీ అధనం

వరదల పేరిట కూటమి నేతలు దోపిడీకి తెరలేపారు. గోదావరి పక్కనే స్టాక్‌ పాయింట్‌ను ఏర్పాటుచేసి లారీకి రూ.9 వేల చొప్పున వసూలు చేస్తున్నారు. రవాణా ఖర్చులతో వినియోగదారులకు చేరే సరికి ఈ ధర మరింత భారంగా మారుతోంది. అధికార యంత్రాంగం పట్టించుకోకపోవడంతో నిర్వాహకుల ఇష్టారాజ్యంగా మారింది.

సాక్షి, భీమవరం: వరదల సమయంలో కొరత రాకుండా జిల్లాలో స్టాక్‌ పాయింట్లు ఏర్పాటుకు ఏప్రిల్‌లో జిల్లా ఇసుక కమిటీ నిర్ణయించింది. జిల్లా అవసరాలకు తగ్గట్టుగా ఐదు లక్షల టన్నుల ఇసుకను నిల్వ చేయాలన్నది లక్ష్యం. జిల్లా అవసరాల కోసం ప్రత్యేకంగా కేటాయించిన తూర్పుగోదావరి జిల్లా పెండ్యాల ఓపెన్‌ రీచ్‌ నుంచి ఇసుక తరలింపు చేయాల్సి ఉంది. ఈ మేరకు జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో ఒక్కొక్కటి చొప్పున స్టాక్‌ పాయింట్‌ ఏర్పాటుచేసి నిర్వహణ బాధ్యతల్ని ఏజెన్సీలకు అప్పగించారు. లక్ష్యం మేరకు ఒక్కో స్టాక్‌ యార్డు వద్ద 70 వేల టన్నుల ఇసుకను నిల్వ చేయాలి. కాగా జిల్లా అంతటా కలిపి కేవలం 1.20 లక్షల టన్నులు మాత్రమే స్టాకు పెట్టడం గమనార్హం. వీటిలో ఆచంట స్టాక్‌ పాయింట్‌లో 20,100 టన్నులు పెట్టగా, భీమవరంలో 6,240, నరసాపురంలో 2,450, పాలకొల్లులో 19,555, తాడేపల్లిగూడెంలో 35,180, తణుకులో 7,878, ఉండిలో 28,990 టన్నులు నిల్వ చేసినట్టు తెలుస్తోంది. ఇసుక ర్యాంపు నుంచి స్టాక్‌ పాయింట్‌కు దూరాన్ని బట్టి ఒక్కో టన్నుకు రూ.306 నుంచి రూ.581 ధరగా నిర్ణయించారు. కాగా ఈ స్టాక్‌ పాయింట్లలో అమ్మకాలు మొదలు కావాల్సి ఉంది.

సిద్ధాంతంలో అనుమతులున్నాయా ?

సిద్ధాంతం వశిష్ట గోదావరి వంతెన దిగువన హైవేను ఆనుకుని భారీ మొత్తంలో నిల్వలతో స్టాక్‌ పాయింట్‌ను ఏర్పాటుచేశారు. తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీకి చెందిన ముఖ్య నేత ఈ స్టాక్‌ పాయింట్‌ నిర్వహణను చూస్తున్నట్టు తెలిసింది. పక్కనే కిలోమీటరు దూరంలో సీఆర్‌జెడ్‌ పరిధిలోని నడిపూడితో పాటు పక్కనే తూర్పుగోదావరి జిల్లా కడింపాడు ర్యాంపు నుంచి లారీకి రూ.1,500 నుంచి రూ.2 వేల కిరాయిలపై ఇక్కడికి ఇసుకను తరలించినట్టు సమాచారం. ఇక్కడ స్టాక్‌ పాయింట్‌ ఏర్పాటుకు రెవెన్యూ, మైన్స్‌ అధికారులు సంయుక్తంగా పరిశీలన చేసినట్టు అధికారి ఒకరు తెలిపారు. ఉన్నత స్థాయి నుంచి అనుమతులు వచ్చిందీ లేనిది ఇంకా తమ దృష్టికి రాలేదన్నారు. కాగా బుధవారం నుంచి ఇక్కడ అమ్మకాలను ప్రారంభించారు. 21 టన్నుల లారీకి రూ.9 వేలు వసూలు చేస్తున్నట్టు లారీ అసోసియేషన్‌ నాయ కులు చెబుతున్నారు. గోదావరికి కిలోమీటరు దూ రం నుంచి ఇసుక తెచ్చి స్టాకు పెట్టి అమ్మకాలు చేస్తున్నారని, లారీ ఇసుకకు రూ.3 వేలు కూడా ఖర్చుకాదని చెబుతున్నారు. గతంలో ఇక్కడి కడింపాడు ర్యాంపు నుంచి రూ.5 వేలకు లోడింగ్‌ చేస్తే ఇప్పుడు స్టాకు పాయింట్‌ పేరిట అదనంగా రూ.4 వేలు వసూలు చేస్తున్నారని, ఈ భారం వినియోగదారులపై పడుతోందని అంటున్నారు.

మూతపడిన ర్యాంపులు

ర్యాంపుల్లోకి నీరు చేరి జూలై ప్రారంభంలోనే దాదాపు మూతపడ్డాయి. వరద నీరు తగ్గి మరలా ర్యాంపులు తెరిచేందుకు మరో నాలుగు నెలల సమయం పట్టే అవకాశం ఉంది. ఈలోపు జిల్లా అవసరాలకు ఈ నిల్వలు ఏ మేరకు సరిపోతా యోనేది వేచిచూడాలి. ఇదిలా ఉండగా వరదల వేళ ప్రజల అవసరాన్ని సొమ్ము చేసుకునేందుకు సొంత అవసరాల పేరిట ఆచంట, పెనుగొండ, పోడూరు, యలమంచిలి తదితర మండలాల్లో కూటమి నేతలు భారీ ఎత్తున ఇసుక నిల్వలు పెట్టారు. వీటిలో ఏ స్టాకు పాయింట్లకు అనుమతులు ఉన్నాయి?, వేటికి లేవో? తెలియని పరిస్థితి.

అధనం ఎవరి జేబుల్లోకి..

గోదావరి చెంతనే ఉన్న సిద్ధాంతం స్టాకు పాయింట్‌ వద్ద 20 టన్నుల లారీ లోడింగ్‌కు రూ.9 వేలు వసూలు చేస్తున్నారు. నిర్వాహకులకు ఖర్చు రూ.3 వేలు కూడా కాదు. ప్రభుత్వం ఇసుక ఉచితమని చెప్పి అదనపు వసూళ్లు చేయడం సరికాదు. ఈ అదనపు వసూళ్లు ఎవరి జేబుల్లోకి వెళుతున్నాయో తెలియని పరిస్థితి.

– రావూరి రాజా, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా లారీ అసోసియేషన్‌ అధ్యక్షుడు

ఇసుకాసురులు

వరదల పేరుతో స్టాక్‌ పాయింట్లు

గోదావరి చెంతనే లారీ ఇసుకకు రూ.9 వేలు వసూలు

రవాణా ఖర్చులతో ధర మరింత అదనం

దోపిడీ దారుణమంటున్న లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌

పేరుకే ఉచితం.. దోపిడీ అధనం1
1/1

పేరుకే ఉచితం.. దోపిడీ అధనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement