
బాబు సర్కారు వంచనను ఎండగట్టాలి
సాక్షి, భీమవరం: ఎన్నికల ముందు కూటమి ఇచ్చిన హామీలకు, అధికారంలోకి వచ్చాక సాగిస్తున్న పాలనకు పొంతన లేదని వైఎస్సార్‌సీపీ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కో–ఆర్డినేటర్ బొత్స సత్యనారాయణ విమర్శించారు. ఏడాది కాలంగా చంద్రబాబు సర్కారు వంచించిన తీరును ఎండగట్టి ప్రజలకు అండగా నిలబడేందుకే బాబు ష్యూరిటీ–మోసం గ్యారెంటీ కార్యక్రమానికి వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారని చెప్పారు. ఉండి నియోజకవర్గ పార్టీ కన్వీనర్ పీవీఎల్ నరసింహరాజు అధ్యక్షతన గురువారం కాళ్ల మండలం పెదఅమిరంలోని నిర్మలాదేవి ఫంక్షన్ హాలులో జరిగిన నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశానికి బొత్స ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు, పవన్‌కల్యాణ్, లోకేష్‌లు ఎన్నికల సమయంలో రైతులు, నిరుద్యోగులు, మహిళలు తదితర వర్గాల వారికి ఇచ్చిన హామీలు, పాలనలోకి వచ్చాక వారు మాట మార్చిన వీడియోలను ప్రత్యక్షంగా స్క్రీన్‌పై చూపించారు. బాబు ష్యూరిటీ –భవిష్యత్తు గ్యారెంటీ పేరిట అధికారంలోకి వచ్చిన మొదటి నెల నుంచే సూపర్ సిక్స్ హామీలను త్రికరణ శుద్ధిగా అమలుచేస్తామని, ఆ పథకాల ద్వారా ఏ కుటుంబానికి ఎంత లబ్ధి చేకూరేదీ వివరిస్తూ ఎన్నికల సమయంలో కూటమి నేతలు పంచిన బాండ్ పేపర్లను ఈ సందర్భంగా బొత్స చూపించారు. వాటిలో ఏ పథకాలు అమలుచేశారో చె ప్పాలని బొత్స ప్రశ్నించినప్పుడు ఏమీ చేయలేదంటూ కార్యకర్తలు ముక్తకంఠంతో చెప్పారు. అన్ని హామీలూ అమలుచేసినట్టు సీఎం చంద్రబాబు చెబుతున్నారని, ఎవరైనా ఎదురు ప్రశ్నిస్తే నాలుక మందమంటున్నారని బొత్స మండిపడ్డారు. ప్రతి ఇంటికీ వెళ్లి కూటమి పాలనలో వారికి జరిగిన మోసాన్ని వివరించాలని ఆయన పిలుపునిచ్చారు. మండల, గ్రామ స్థాయిలో సమావేశాలు ఏర్పాటుచేసుకుని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బొత్స సూచించారు.
ఉండిలో చందాల సంస్కృతి
పార్టీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు మాట్లాడుతూ అభివృద్ధి నిధి పేరిట రైతులు, వ్యాపారుల నుంచి చందాలు వసూలు చేసే సంస్కృతిని కొత్తగా ఉండి నియోజకవర్గంలో చూస్తు న్నామని విమర్శించారు. కూటమి నేతల తీరును చూసి ఆయా వర్గాల వారు బెంబేలెత్తిపోతున్నారని చెప్పారు. ఏడాది కాలంలో ఈ నియోజకవర్గంలో 800 మంది పేదల ఇళ్లను కూల్చారని, కానీ ఇదే నియోజకవర్గంలో 25 వేల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చిన ఘనత మాజీ సీఎం వైఎస్ జగన్‌కు దక్కుతుందని తెలిపారు.
ఇంటింటా ఆవేదన : మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ బాబు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ వెళుతున్నప్పుడు ప్రజలు వారి ఆవేదనను వ్యక్తం చేస్తున్నారన్నారు. జగన్ పాలనలో చేతిలో ఎప్పుడూ డబ్బులు ఉండేవని, ఇవాళ అధిక వడ్డీలకు అప్పులు చేయాల్సి వస్తోందని వాపోతున్నారని వివరించా రు. పవన్ కల్యాణ్‌ను నమ్మి మోసపోయామని కా పు మహిళలు ఆవేదన చెందుతున్నారని చెప్పారు. కొత్త పథకాలు వస్తాయనుకుంటే కాపు నేస్తం కూడా ఇవ్వడం లేదంటున్నారని తెలిపారు.
అందుకే బాబు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీ కార్యక్రమం
ప్రతి కార్యకర్తా ప్రజల గొంతుకగా పనిచేయాలి
ప్రభుత్వ వైఫల్యాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలి
వైఎస్సార్‌సీపీ రీజనల్ కో–ఆర్డినేటర్ బొత్స పిలుపు
సెంటు భూమి ఇవ్వలేదు
నరసాపురం పార్లమెంట్ పరిశీలకుడు ముదునూరి మురళీకృష్ణంరాజు మాట్లాడుతూ చంద్రబాబు అనేక వాగ్దానాలు చేసి ఏడాదైందని.. రైతులు, నిరుద్యోగులు, మహిళలకు ఒక్క రూపాయి సాయం చేయలేదని చెప్పారు. ఒక్క నిరుపేదకూ సెంటు స్థలం కూడా ఇవ్వలేదని విమర్శించారు.
ప్రజలను వంచించారు
ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్ మాట్లాడుతూ ఎన్నికల ముందు సూపర్ సిక్స్ అంటూ ఊదరగొట్టి ఇప్పుడు తలచుకుంటేనే భయమేస్తోందని చంద్రబాబు అనడం ప్రజలను వంచించడమేనన్నారు. సంపద సృష్టిస్తానని చెప్పి అందుకు సలహాలు ఇవ్వాలంటూ ప్రజలను కోరడం విడ్డూరంగా ఉందన్నారు.
వైఎస్సార్‌సీపీని బలోపేతం చేయాలి
మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు గూడూరి ఉమాబాల మాట్లాడుతూ కూటమి మోసాలను ప్రజలకు చాటిచెప్పి నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీని బలోపేతం చేయాలన్నారు. భీమవరం నియోజకవర్గ కో–ఆర్డినేటర్ చినమిల్లి వెంకటరాయుడు మాట్లాడుతూ ఎన్నికల ముందు హామీలివ్వడం, అధికారంలోకి వచ్చాక వాటిని గాలికొదిలేయడం చంద్రబాబు నైజమని విమర్శించారు. ఎంబీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పెండ్ర వీరన్న మాట్లాడుతూ చంద్రబాబు చేస్తున్న మోసాల్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపైనా ఉందన్నారు.
కార్యకర్తలకు సముచిత స్థానం
అబద్ధాలు చెప్పడం, మోసాలు చేయడంలో చంద్రబాబును మించిన వారుండరని నియోజకవర్గ ఇన్‌చార్జి పీవీఎల్ నరసింహరాజు అన్నారు. కూటమి ఏమీ చేయకుండానే అన్నీ చేశామంటూ ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటన్నారు. కష్టించి పనిచేసే ప్రతి కార్యకర్తకూ పార్టీలో సముచిత స్థానం ఉంటుందని, ఆ దిశగా తాను కృషిచేస్తానని హామీ ఇచ్చారు. నియోజకవర్గంలో బాబు ష్యూరిటీ–మోసం గ్యారెంటీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పీవీఎల్ కోరారు. క్షత్రియ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పాతపాటి శ్రీనివాసరాజు, జిల్లా అధికార ప్రతినిధి మేడిద జాన్సన్, అధిక సంఖ్యలో వైఎస్సార్‌సీపీ శ్రేణులు పాల్గొన్నారు.

బాబు సర్కారు వంచనను ఎండగట్టాలి