
శ్రమజీవులకు ఎంత కష్టం..
ద్వారకాతిరుమల: వేర్వేరుగా జరిగిన రెండు ప్రమాదాల్లో 20 మంది కూలీలు, ఒక డ్రైవర్ గాయపడ్డారు. ద్వారకాతిరుమల మండలంలోని లైన్‌గోపాలపురం జాతీయ రహదారిపై ఎండు కొబ్బరి కాయల లోడుతో వెళుతున్న బొలేరో వాహనం వెనుక టైరు పేలడంతో అదుపు తప్పి బోల్తా పడగా 14 మంది గాయాలపాలయ్యారు. గుండుగొలను శివారు బీసీ కాలనీ వద్ద చేపల చెర్వులకు మేత తరలిస్తున్న లారీ అదుపు తప్పి బోల్తా పడడంతో ఏడుగురు కూలీలు గాయపడ్డారు.
టైరు పేలి బోల్తా పడ్డ వ్యాన్
ద్వారకాతిరుమల మండలం కప్పలకుంట నుంచి ఎండు కొబ్బరి కాయల లోడుతో బొలేరో వాహనం దెందులూరు మండలం గోపన్నపాలెంకు వెళుతోంది. లైన్ గోపాలపురం జాతీయ రహదారిపైకి వచ్చేసరికి వాహనం వెనుక టైరు పేలింది. ఈ ప్రమాదంలో 5 గురు తీవ్రంగా, 9 మంది స్వల్పంగా గాయపడ్డారు. డ్రైవర్ వాన కిషోర్‌తో పాటు, వాహనంపై ఉన్న గోపన్నపాలెం, వేగవరంనకు చెందిన 13 మంది కూలీలు కొండేటి గంగాధరరావు, కాసగాని ఆంజనేయులు, బెజవాడ రత్తయ్య, వాన తిరుపతి, మోర్ల రాము, ఆరే రామకృష్ణ, తాడి సత్యవతి, తాడి సంతోష్, అప్పల నాయుడు, ఒగ్గుల చరణ్, బి.అప్పన్న, ఐక రాంబాబు, రెగాన రామ్మూర్తి, బోణె అప్పమ్మ తదితరులు గాయపడ్డారు. స్థానికులు క్షతగాత్రులను 108, హైవే ఆంబులెన్స్‌లో హుటాహుటీన భీమడోలు ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం నిమిత్తం తీవ్రంగా గాయపడ్డ ఆంజనేయులు, సంతోష్, అప్పలనాయుడు, సత్యవతి, గంగాధరరావు లను ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
లారీ బోల్తా.. కూలీలకు గాయాలు
భీమడోలు: తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుంచి గుండుగొలను శివారు రత్నాపురంలోని ఆక్వా చెర్వులకు మేత తవుడు దిగుమతి చేసేందుకు లారీ వచ్చింది. లారీ డ్రైవర్ సత్తార్ తవుడు దించేందుకు జట్టు కూలీలను పురమాయించుకుని ఆక్వా చెరువుల వద్దకు వెళుతుండగా గుండుగొలను శివారు బీసీ కాలనీ వద్ద గల మలుపు వద్దకు వచ్చేసరికి లారీ అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో లారీ కేబిన్‌లో ఉన్న కూలీలు బూరి తిరపతయ్య, పెద్దింటి కృష్ణ, మంత్రి పాపారావు, చిగడాపు వెంకన్న, గొర్జి శ్రీను, నేలబుల్లి సూర్యానారాయణలతో మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 అంబులెన్స్‌లలో ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు భీమడోలు పోలీసులు తెలిపారు.
ద్వారకాతిరుమలలో వ్యాన్ బోల్తా పడి 14 మందికి గాయాలు
గుండుగొలనులో లారీ అదుపు తప్పి ఏడుగురు కూలీలకు గాయాలు

శ్రమజీవులకు ఎంత కష్టం..

శ్రమజీవులకు ఎంత కష్టం..