
మట్టి తరలింపు వాహనాలతో ఉక్కిరిబిక్కిరి
ఉండి: ఒకవైపు వర్షం.. మరోవైపు మట్టి రవాణా వాహనాలతో చెరుకువాడ గ్రామం సోమవారం ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరైంది. మట్టి అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతుండడంతో మట్టి పెళుసులు రోడ్డుపై పడి ఈ ప్రాంతవాసులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. దీంతో ఆగ్రహించిన స్థానికులు వైఎస్సార్ సీపీ మండల ఉపాధ్యక్షుడు బొడ్డు నాగన్న, ఎంపీటీసీ చిగురుపాటి కృష్టాఫర్, వార్డు సభ్యుడు బిల్‌మోరియా ఆధ్వర్యంలో మట్టి అక్రమ రవాణాను అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపటికే ట్రాఫిక్‌జామ్ ఏర్పడి మట్టి రవాణా వాహనాలు బారులు తీరాయి. సమస్యపై ఎన్నిసార్లు గ్రామాధికారులు, మండలాధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవడం లేదంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై సమాచారం అందుకున్న తహసీల్దార్ నాగార్జున వెంటనే వీఆర్‌ఏను పంపించి వాహనాలను నిలుపుదల చేశారు. దీంతో స్థానికులు ఎవరి పనులకు వాళ్లు వెళ్లిపోయారు. అయితే కొద్దిసేపటికే మట్టి రవాణా వాహనాలు తిరిగి రోడ్డెక్కడంతో ప్రజలు అవాక్కయ్యారు. ఇదేంటి అని అధికారులను ఆరా తీసినా సమాధానం చెప్పేవారు కరువయ్యారు. ఇది కూటమి నాయకులకు సంబందించిన మట్టి కాబట్టి మేము ఆపలేము అని ఓ గ్రామాధికారి చెప్పడంపై స్థానిక నాయకులు మండిపడుతున్నారు. చెరుకువాడ నుంచి అర్తమూరు ఆర్‌అండ్‌బీ రోడ్డు, గుమ్ములూరు పరిధిలో జాతీయ రహదారిపై మట్టి పరుచుకుపోవడంతో చాలా మంది వాహనదారులు సోమవారం సైతం ప్రమాదాలకు గురయ్యారు. అయితే ఇదేమీ మాకు సంబంధం లేదన్నట్లు ఆయా శాఖల అధికారులు ప్రవర్తించడం వింతగా ఉందని స్థానికులు తెలిపారు.
చెరుకువాడలో విచ్చలవిడిగా మట్టి రవాణా
రోడ్డుపై ఉన్న మట్టి పెలుసులతో తరచూ ప్రమాదాలు
వైఎస్సార్ సీపీ నేతలతో కలిసి వాహనాలను అడ్డుకున్న ప్రజలు
కాసేపటికే వదిలేసిన అధికారులు

మట్టి తరలింపు వాహనాలతో ఉక్కిరిబిక్కిరి