
అలరించిన నాటిక ప్రదర్శనలు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): అంబికా సంస్థల వ్యవస్థాపకులు ఆలపాటి రామచంద్రరావు శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని అంబికా సంస్థలు, హిందూ యువజన సంఘం, హేలాపురి కళా పరిషత్ ఆధ్వర్యంలో జరుగుతున్న జాతీయ స్థాయి నాటిక పోటీలు ప్రేక్షకులను విశేషంగా అలరించాయి. సోమవారం హైదరాబాద్ యువభేరి థియేటర్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ప్రదర్శించిన నా శత్రువు, సహృదయ ద్రోణాదుల సంస్థ ఆధ్వర్యంలో ప్రదర్శించిన వర్క్ ఫ్రమ్ హోమ్ నాటికలకు ప్రేక్షకుల నుంచి చక్కటి స్పందన లభించింది. తొలుత అంబికా సంస్థల చైర్మన్ అంబికా కృష్ణ అధ్యక్షతన జరిగిన సభా కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి, కై కలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ, మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళి మాట్లాడుతూ ఏలూరులో సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణలోను, కళలను ప్రోత్సహించడంలో అంబికా సంస్థలు, హిందూ యువజన సంఘం ఎప్పుడూ ముందుంటాయన్నారు. నాటక రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న కళాకారులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హిందూ యువజన సంఘం మేనేజ్‌మెంట్ కమిటీ అధ్యక్షుడు యర్రా సోమలింగేశ్వరరావు, సెక్రటరీ కళారత్న కేవీ సత్యనారాయణ, ఎగ్జిక్యూటివ్ కమిటీ అధ్యక్షుడు ఇరదల ముద్దుకృష్ణ, సెక్రటరీ మజ్జి కాంతారావు, అంబికా ప్రసాద్, అంబికా రాజా, వేణు గోపాల్ లునాని, ఎంవీవీ నాగేశ్వరరావు, ఎల్.వెంకటేశ్వరరావు, కేబీ రావు, సంకు సురేష్, ఎం.సూర్యనారాయణ యాదవ్, తదితరులు పాల్గొనగా ఈ కార్యక్రమాన్ని మహమ్మద్ ఖాజావలి సమన్వయం చేశారు.