
దిక్కుతోచని పుచ్చ రైతు
నూజివీడు: ఎంతో ఆశతో ఈ ఏడాది పుచ్చ కాయల సాగు చేపట్టిన రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. అమ్మబోతే అడవి, కొనబోతే కొరివిలా మార్కెట్‌లో పరిస్థితులు ఉండటం, వాతావరణం అనుకూలించకపోవడంతో రైతుల పరిస్థితి దయనీయంగా తయారైంది. దిగుబడి వచ్చే సమయానికి ధర పతనమవ్వడంతో రైతులు నష్టాల పాలయ్యారు. నూజివీడు మండలంలోని తుక్కులూరు, ముసునూరు మండలంలోని కాట్రేనిపాడులలో దాదాపు 50 ఎకరాల్లో పుచ్చ సాగు చేపట్టగా సాగు చేసిన రైతులందరూ నష్టాల ఊబిలో కూరుకుపోయారు. అకాల వర్షాలతో కాయలు కొనేవారు లేక తోటలోనే కుళ్లిపోవడంతో రైతులు చేసేదేమీ లేక వదిలేస్తున్నారు.
ఎకరాకు రూ.1.50 లక్షల వరకు పెట్టుబడి
ఎకరాకు రూ.25 వేల చొప్పున కౌలుకు తీసుకొని సాగు చేసిన పుచ్చ పంటకు ఎకరాకు రైతులు రూ.1.20 లక్షల వరకు పెట్టుబడి పెట్టారు. దిగుబడి బాగా వచ్చినా.. సాగు సమయానికి మార్కెట్‌లో టన్ను ధర రూ.11 వేల నుంచి రూ.12 వేల వరకు ఉండగా దిగుబడి సమయానికి రూ.6 వేలకు పడిపోయింది. దీంతో చేసేదేమీ లేక రైతులు అదే ధరకు విక్రయించేశారు. ఐదేళ్లుగా టన్ను రూ.18 వేల నుంచి రూ.20 వేలు పలికింది. దీంతో పుచ్చసాగు చేసిన రైతులు లాభాల బాటలో పయనించారు. ఈ ఏడాది మాత్రం అందుకు విరుద్ధంగా ధర పతనమైంది.
కొంపముంచిన అకాల వర్షాలు
పుచ్చ సాగు ప్రారంభంలో అనుకూలించిన వాతావరణం దిగుబడి రావడం ప్రారంభించాక ఒక్కసారిగా అకాల వర్షాలతో కొంప ముంచేశాయి. ఎకరాకు 15 నుంచి 18 టన్నుల దిగుబడి వచ్చినప్పటికీ అకాల వర్షాలు పడటంతో పుచ్చకాయలు కొనుగోలు చేసే వ్యాపారులు ముందుకు రాలేదు. దీంతో కోతకు సిద్ధంగా ఉన్న కాయలు కుళ్లిపోతుండటంతో రైతులు చేసేది లేక వదిలేశారు. కొందరు రైతులు కాయలను కోసి వారే నేరుగా ట్రాక్టర్లలో వేసుకొని గ్రామాల్లోకి, పట్టణాల్లోకి వెళ్లి అమ్మినా పెట్టుబడులు రాలేదు. కాలం కలిసి రాకపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు.
అకాల వర్షాలతో తగ్గిన కొనుగోళ్లు
ధర పతనమై నష్టాల ఊబిలో రైతులు
రూ. 6 లక్షల నష్టం
ఆరెకరాల్లో పుచ్చ సాగు చేశా. కౌలుతో సహా ఆరెకరాలకు రూ.7.50 లక్షలు పెట్టుబడి అయింది. రూ.6 వేల చొప్పున 25 టన్నులు విక్రయించా. అనంతరం అకాల వర్షాలు పడటంతో కాయ కుళ్లిపోయింది. దీంతో ఆరు లక్షల నష్టం వాటిల్లింది. గతేడాది టన్ను రూ.19 వేల నుంచి రూ.20 వేలు ఉంది. ఈ ఏడాది మాత్రం దారుణంగా పడిపోయింది.
– తల్లిబోయిన రాజగోపాలస్వామి, మర్రికుంట, నూజివీడు మండలం
పెట్టుబడి లక్ష.. వచ్చింది రూ.50 వేలే
15 ఎకరాల్లో పుచ్చ పంట సాగుచేశా. ఎకరాకు పెట్టుబడి రూ.1.10 లక్షలు పెట్టాం. దిగుబడి ప్రారంభమైన నాటి నుంచి టన్ను ధర రూ.6 వేలకు పడిపోయింది. దీంతో పుచ్ఛకాయలను విక్రయిస్తే ఎకరాకు రూ.50 వేలు మాత్రమే వచ్చాయి. దీంతో దాదాపు రూ.8 లక్షల నష్టం వాటిల్లింది. మార్కెట్‌లో ఈ ఏడాది పరిస్థితి దారుణంగా ఉంది.
– పాలడుగు విజయ్‌కుమార్, తుక్కులూరు, నూజివీడు మండలం

దిక్కుతోచని పుచ్చ రైతు

దిక్కుతోచని పుచ్చ రైతు