
యథేచ్ఛగా గ్రావెల్ రవాణా
సాక్షి టాస్క్‌ఫోర్స్: యథేచ్చగా టిప్పర్లతో పోలవరం కాలువ నుంచి గ్రావెల్ రవాణా చేస్తున్నారు. దెందులూరు మండలం చల్ల చింతలపూడి గ్రామంలో బ్రిడ్జి పక్కన పోలవరం గట్టును తవ్వి టిప్పర్లతో గ్రావెల్ తరలిస్తున్న ప్రభుత్వ అధికారులు స్పందించకుండా మౌనంగా ఉన్నారు. మండల కేంద్రానికి కూతవేటు దూరంలో ఈ తతంగం జరుగుతున్నా పట్టనట్లు వ్యవహరించడంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రమాదకరంగా ఇసుక తవ్వకాలు
జంగారెడ్డిగూడెం: మండలంలోని ప్రధాన కాలువల్లో ఇసుక తవ్వకాలు యథేచ్ఛగా జరిగిపోతున్నాయి. నిబంధనలను తుంగలో తొక్కి తవ్వకాలు చేస్తున్నారు. వంతెనలు, కల్వర్టులు, కట్టడాలు సమీపంలో ఇసుక తవ్వకూడదనే నిబంధన ఉన్నప్పటికీ అవి పట్టడం లేదు. జల్లేరు గ్రామంలోని జల్లేరు కాలువపై నిర్మించిన వంతెన సమీపంలో ఇసుక తవ్వేయడంతో వంతెనకు ప్రమాదం పొంచి ఉంది. దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
డాబా పైనుంచి పడి వ్యక్తి మృతి
ఆగిరిపల్లి: మండలంలోని అడవినెక్కలంలో నిద్రలో డాబా పై నుంచి కిందపడి వ్యక్తి మృతి చెందాడు. ఎస్సై శుభ శేఖర్ తెలిపిన వివరాల ప్రకారం అడవినెక్కలానికి చెందిన అద్దేపల్లి దుర్గారావు(45) కూలీ చేసుకుంటూ జీవిస్తున్నాడు. శుక్రవారం రాత్రి డాబాపై పడుకున్నాడు. నిద్రపోతూ ప్రమాదవశాత్తు కింద పడిపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దుర్గారావు చికిత్స పొందుతూ శనివారం మరణించాడు. దుర్గారావుకు కొడుకు, కూతురు ఉన్నారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
కొండచిలువ హల్‌చల్
తాడేపల్లిగూడెం రూరల్: మండలంలోని వెంకట్రామన్నగూడెం తాడిపూడి కాలువలో జంగిల్ క్లీనింగ్ చేస్తుండగా, శనివారం కొండ చిలువ ఉపాధి హామీ పథకం శ్రామికుడి కాళ్లు, నడుమును చుట్టేయడంతో అందరూ ఆందోళనకు గురయ్యారు. మిగతావారు కొండ చిలువను విడదీసి అతనిని కాపాడారు. ఈ పెనుగులాటలో ఇద్దరికి చేతులు విరిగినట్లు సమాచారం. అనంతరం కొండ చిలువను హతమార్చారు.

యథేచ్ఛగా గ్రావెల్ రవాణా

యథేచ్ఛగా గ్రావెల్ రవాణా