
లింగ నిర్ధారణ పరీక్షలు చేయకూడదు
భీమవరం (ప్రకాశంచౌక్) : జిల్లాలో ఎట్టి పరిస్థితుల్లో లింగ నిర్ధారణ పరీక్షలు చేయకూడదని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారిణి డాక్టర్ జి.గీతాబాయి అన్నారు. గురువారం ఆమె అధ్యక్షతన జిల్లా స్థాయి గర్భస్థ పిండ లింగ నిర్ధారణ కమిటీ సలహా సంఘం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గీతాబాయి మాట్లాడుతూ జిల్లాలో ఉన్న అన్ని స్కానింగ్ కేంద్రాలను తనిఖీ చేయాలని అధికారులను ఆదేశించారు. ఆడ పిల్లల నిష్పత్తి తక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి ఆయా ప్రాంత ప్రజల్లో అవగాహన కల్పించాలని కోరారు.
రేపు ఏలూరులో ప్రత్యేక ఉద్యోగ మేళా
ఏలూరు (టూటౌన్): ఏలూరు జిల్లాలోని ఉపాధి, శిక్షణ శాఖ ఆధ్వర్యంలో, నేషనల్ కెరీర్ సర్వీస్ (ఎన్‌సీఎస్) సంయుక్త భాగస్వామ్యంతో శనివారం ఉదయం 10:30 గంటలకు జిల్లా ఉపాధి కార్యాలయం, ఏలూరులో ప్రత్యేక ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి సి. మధుభూషణ్ రావు తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. వివిధ కంపెనీల్లో ఉద్యోగాల నిమిత్తం ఇంటర్వ్యూలలో పాల్గొనాలనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా ఫార్మల్ డ్రెస్ కోడ్‌లో, రెజ్యూమ్, సంబంధిత ధ్రువపత్రాలతో హాజరుకావాల్సి ఉంటుందని పేర్కొన్నారు. మరిన్ని వివరాలను కోసం 88868 82032 నంబర్‌కు ఫోన్ చేయాలని సూచించారు.
చికిత్స పొందుతూ యువతి మృతి
దెందులూరు: పెద్దలు కుదిర్చిన పెళ్లి సంబంధం చేసుకోవడం ఇష్టం లేక ఆత్మహత్యాయత్నం చేసిన మౌనిక అనే యువతి చికిత్స పొందుతూ మృతి చెందిందని దెందులూరు ఎస్సై ఆర్.శివాజీ తెలిపారు. వీరభద్రపురం గ్రామానికి చెందిన గొట్టికల మౌనిక అదే గ్రామానికి చెందిన యువకుడితో కుటుంబ సభ్యులు పెళ్లి కుదిర్చారు. అయితే ఈ పెళ్లి ఇష్టం లేకపోవడంతో ఈ నెల 12న పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. గమనించిన కుటుంబ సభ్యులు మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం గుంటూరు వైద్యశాలలో చేర్పించారు. అప్పటి నుంచి చికిత్స పొందుతున్న యువతి గురువారం మృతి చెందింది. ఈ మేరకు ఆస్పత్రి నుంచి వచ్చిన సమాచారంతో కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.