
హద్దు మీరిన మట్టి దందా
ద్వారకాతిరుమల: కూటమి నేతల అక్రమాలు హద్దులు మీరాయి. మట్టి ముసుగులో అడ్డగోలుగా ఎర్ర గ్రావెల్ అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్నారు. అనుమతులు ఉన్నాయంటూ తమకు నచ్చిన చోట యథేచ్ఛగా తవ్వకాలు సాగిస్తూ కోట్లు గడిస్తున్నారు. ఈ మట్టి మాఫియాలో ఖద్దరు చొక్కా పెద్దలకు, కొందరు ఉన్నతాధికారులకు సైతం వాటాలు అందుతున్నాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. ద్వారకాతిరుమల మండలంలోని పోలవరం కుడి కాలువ గట్టుపై జరుగుతున్న మట్టి దందాపై సాక్షి గ్రౌండ్ రిపోర్ట్.
మూడు పాయింట్లలో అనుమతులు
పంగిడిగూడెం వద్ద ఒక పాయింట్, ఎం.నాగులపల్లి వద్ద రెండు పాయింట్లలో తవ్వకాలకు ఇరిగేషన్, మైనింగ్ శాఖలు అనుమతులు ఇచ్చాయి. ఒక క్యూబిక్ మీటర్‌కు ఇరిగేషన్ శాఖకు జీఎస్టీతో కలిపి రూ.170, మైనింగ్ శాఖకు రూ.106 చెల్లించాల్సి ఉంది. అయితే భీమడోలు మండలం సూరప్పగూడెంకు చెందిన నవ్య ఎర్త్‌మూవర్స్ వారు ఇరిగేషన్ శాఖకు 2 వేల క్యూబిక్ మీటర్లకు నగదు చెల్లించగా మైనింగ్ శాఖకు మాత్రం వెయ్యి క్యూబిక్ మీటర్లకు మాత్రమే నగదు చెల్లించి అనుమతులు పొందారు. మిగిలిన వెయ్యి క్యూబిక్ మీటర్ల మట్టి ఏమైనట్టు. ఇదిలా ఉంటే ఏలూరుకు చెందిన లెవలప్ ప్రాజెక్ట్స్ వారు 2,500 క్యూబిక్ మీటర్లకు, కై కలూరు మండలం ఆటపాకకు చెందిన బీకేఎం కనస్ట్రక్షన్స్ వారు 5 వేల క్యూబిక్ మీటర్లకు నగదు చెల్లించి అనుమతులు పొందారు.
అన్ని రోజులు అనుమతి ఎందుకో..
రోజుకి ఒక్కో పాయింట్ నుంచి 70 నుంచి 80 టిప్పర్ల గ్రావెల్ మట్టి బయటకు వెళుతోంది. ఒక్కో టిప్పర్‌లో 15 క్యూబిక్ మీటర్ల మట్టి పడుతుంది. దీన్ని బట్టి నవ్య ఎర్త్ మూవర్స్ వెయ్యి క్యూబిక్ మీటర్ల మట్టిని 67 ట్రిప్పుల్లో, లెవలప్ ప్రాజెక్ట్స్ 2,500 క్యూబిక్ మీటర్ల మట్టిని 167 ట్రిప్పుల్లో, బీకేఎం కనస్ట్రక్షన్స్ 5 వేల క్యూబిక్ మీటర్ల మట్టిని 334 ట్రిప్పుల్లో తోలుకోవాలి. ఇందులో ఒకరికి 30 రోజులు, ఇంకొకరికి 40, మరొకరికి 90 రోజుల పాటు అనుమతులు ఇచ్చారు. వెయ్యి క్యూబిక్ మీటర్లు (67 టిప్పర్లు)మట్టిని 30 రోజులు తోలుకోవడానికి మైనింగ్ అధికారులు అనుమతులు ఇవ్వడం హాస్యాస్పదంగా ఉంది.
రైతుల ప్రాణాలతో చెలగాటాలు
అనుమతులు పొందిన పాయింట్లలో కాకుండా తమకు నచ్చిన పాయింట్లలో మట్టిని తవ్వేస్తున్నారు. అది కూడా గట్టుపై ఉన్న మట్టిని కాకుండా, అక్కడే తాడి చెట్టు లోతున భూమిని తవ్వి, ఎర్ర గ్రావెల్‌ను అమ్ముకుంటున్నారు. ఇటీవల ఎం.నాగులపల్లి వద్ద కొందరు రైతులు ఈ తవ్వకాలను అడ్డుకుని, ఓ కంపెనీ వ్యక్తిని నిలదీశారు. అయితే తవ్వకాలు పూర్తయ్యాక పూడ్చి వెళతామని సమాధానమిచ్చి వారిపని వారు చేసుకోవడం మొదలు పెట్టారు. గట్టిగా అడిగితే కూటమి నేతలు ఏం చేస్తారోనన్న భయంతో వారు నిమ్మకుండిపోయారు. అధికారులకు ఫిర్యాదు చేస్తుంటే వారికి అనుమతులు ఉన్నాయంటున్నారని, తవ్వకాలు జరిగిన ప్రాంతాలను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే తమ బాధ అర్థమవుతుందని అంటున్నారు. గ్రావెల్ తవ్వకాలు జరుగుతుంటే అధికారులు ఏం చేస్తున్నారో చెప్పాలని ప్రశ్నిస్తున్నారు.
ఖద్దరు చొక్కా పెద్దలకూ వాటాలు
ఇరిగేషన్, మైనింగ్ శాఖల అధికారులు సంయుక్తంగా పరిశీలించి, హద్దులను నిర్ణయించి, రాళ్లు పాతిపెట్టిన తరువాత ఆ పరిధిలో మాత్రమే తవ్వకాలు జరపాలి. అయితే ఆ నిబంధనలేవీ ఇక్కడ అమలు కాలేదు. ఈ తవ్వకాల్లో ఖద్దరు చొక్కా పెద్దలకు, అధికారులకు వాటాలు ఉండటమే కారణంగా తెలుస్తోంది.
క్యాష్ చేసుకుంటున్న నేతలు
ఎర్ర గ్రావెల్‌కు మంచి డిమాండ్ ఉండటంతో నేతలు క్యాష్ చేసుకుంటున్నారు. కాలువ పక్కన సమాంతరంగా మరో కాలువలా ఎర్ర గ్రావెల్ తవ్వకాలు జరుపుతున్నారు. టిప్పర్ గ్రావెల్ మట్టిని దూరాన్ని బట్టి రూ.7 నుంచి 12 వేలకు విక్రయించి, సొమ్ము చేసుకుంటున్నారు. కై కలూరు–పామర్రు హైవేకి, చుట్టుపక్కల ప్రాంతాల్లోని రియల్ ఎస్టేట్ వెంచర్ల చదునుకు ఈ గ్రావెల్‌ను తరలిస్తున్నారు.
పరిశీలిస్తాం..
కాలువ గట్టుపై గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్నట్టు, తమ దృష్టికి రాలేదని ఇరిగేషన్ ఏఈ బాపూజీ తెలిపారు. వెంటనే పరిశీలిస్తామని చెప్పారు.
మట్టి ముసుగులో యథేచ్ఛగా ఎర్ర గ్రావెల్ తవ్వకాలు
పోలవరం కాలువ గట్టుపై అడ్డగోలుగా తవ్వకాలు
ఖద్దరు చొక్కా పెద్దలకు, ఉన్నతాధికారులకూ వాటాలు
సాక్షి పరిశీలనలో బట్టబయలు

హద్దు మీరిన మట్టి దందా

హద్దు మీరిన మట్టి దందా