నూజివీడు: మండలంలోని దేవరగుంట, ఓగిరాల తండాలకు చెందిన ఎక్సైజ్ పాత నేరస్తులు 21 మందిని తహసీల్దార్ గుగులోతు భద్రూ నాయక్ ఎదుట హాజరుపరిచి బైండోవర్ చేసినట్లు ఎక్సైజ్ సీఐ ఏ మస్తానయ్య మంగళవారం తెలిపారు. దేవరగుంటకు చెందిన 19 మంది, ఓగిరాల తండాకు చెందిన ఇద్దరు వీరిలో ఉన్నారన్నారు. ఈ సందర్భంగా తహసీల్దార్ భద్రూ మాట్లాడుతూ ఏడాది పాటు బైండోవర్ అమలులో ఉంటుందని, ఈ సమయంలో ఎక్సైజ్ నేరాలకు పాల్పడినట్లయితే రూ.లక్ష వరకు జరిమానా విధించడం జరుగుతుందన్నారు.
ప్రమాదవశాత్తూ రైలు నుంచి జారిపడి మహిళ మృతి
ఏలూరు టౌన్: ఏలూరు సత్రంపాడు ప్రాంతంలో ప్రమాదవశాత్తు రైలు నుంచి జారిపడి ఓ మహిళ మృతి చెందింది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. తూర్పుగోదావరి జిల్లా రాజానగరానికి చెందిన బొమ్మేతి కుమారి హైదరాబాద్‌లోని తన చెల్లిని చూసేందుకు తల్లిదండ్రులతో కలిసి సోమవారం రాత్రి ద్వారపూడిలో ట్రైన్ నెంబర్ 12737 గౌతమీ ఎక్స్‌ప్రెస్ ఎక్కారు. మహిళా కంపార్ట్‌మెంట్‌లో ప్రయాణిస్తున్న కుమారి రైలు బండి ఏలూరు సత్రంపాడు సమీపంలోకి వచ్చే సరికి ప్రయాణికుల రద్దీతో ప్రమాదవశాత్తు రైలునుంచి జారిపడింది. తీవ్ర గాయాలపాలైన ఆమెను 108 అంబులెన్స్‌లో ఏలూరు జీజీహెచ్‌కు తరలించారు. ఆమె చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందింది. ఏలూరు రైల్వే ఎస్సై పీ.సైమన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు జీజీహెచ్ మార్చురీకి తరలించారు.
అగ్ని ప్రమాదంలో రెండు తాటాకిళ్లు దగ్ధం
కుక్కునూరు: అగ్ని ప్రమాదంలో రెండు తాటాకిళ్లు దగ్ధమయ్యాయి. బర్లమడుగు గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులు తాటి చెట్టుకు నిప్పంటించడంతో ఆ నిప్పు రవ్వలు ఎగసి గ్రామానికి చెందిన రేసు రాజు, సోయం బుల్లెమ్మ ఇళ్లపై పడడంతో అగ్నికి ఆహూతయ్యాయి. స్థానికులు ఫైర్ స్టేషన్‌కు సమాచారం అందించడంతో ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. కాగా ఈ ప్రమాదంలో ఇంట్లో సామాన్లతో సహా అన్ని కాలి బూడిద కావడంతో బాధితులు కట్టుబట్టలతో మిగిలామని కన్నీటి పర్యంతమయ్యారు. బర్లమడుగు అగ్ని ప్రమాద బాధితులకు వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు తాండ్ర రాజేష్ ఒక్కో కుటుంబానికి రూ.5 వేలు చొప్పున రూ.10 వేల ఆర్థిక సహాయాన్ని అందించారు.