
డీఎంహెచ్‌వోకు వినతి
ఏలూరు టౌన్: ఏలూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పేరుతో ఒక వ్యక్తి అనధికార దందాలకు పాల్పడుతున్నారని, చర్యలు తీసుకోవాలని కోరుతూ మంగళవారం ప్రైవేట్ ల్యాబ్ టెక్నీషియన్స్ అసోసియేషన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో డీఎంహెచ్‌వో డాక్టర్ మాలినికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తామంతా ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ చదువుకొని, వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో ప్రైవేట్ ల్యాబ్‌లు నిర్వహించుకుంటూ జీవనం గడుపుతున్నామన్నారు. అయితే గత కొంత కాలంగా 70326 72067 నెంబర్ తో కాల్ చేస్తూం. మేము జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆఫీసు నుంచి మీనాక్షి నీ మాట్లాడుతున్నాను.. మీ లాబ్ పై మాకు కంప్లయింట్ వచ్చింది.. ఈ ఫిర్యాదును జిల్లా ఉన్నతాధికారులకు పంపమంటారా లేదా.. సెటిల్ చేసుకుంటారా అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని తెలిపారు. రూ.20,000 చెల్లిస్తే సమస్య పరిష్కారం అవుతుందని డిమాండ్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. వీటిపై విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఏలూరు జిల్లా ప్రైవేట్ ల్యాబ్ టెక్నీషియన్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎంఎస్వి ప్రసాద్, ప్రధాన కార్యదర్శి కొసరాజు శ్రీ నాగ సతీష్, కోశాధికారి సత్యకుమార్, సభ్యులు సురేష్, హరికృష్ణ, దుర్గారావు, శ్రీనివాసరావు, వెంకటేశ్వరరావు, సింహాద్రి ఉన్నారు.