
రెవెన్యూ రికార్డుల్లో అవకతవకలు
కాళ్ల: కాళ్లలో రెవెన్యూ రికార్డు ట్యాంపరింగ్ చేసిన రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలని కాళ్ళ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తహసీల్దార్ కార్యాలయం వద్ద కాళ్ళ గ్రామానికి చెందిన రైతులు సోమవారం ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ బ్రిటిష్ కాలంలో జరిగిన సర్వే ప్రకారం కాళ్ళ వ్యవసాయ భూముల విస్తీర్ణం సుమారు 3,862 ఎకరాలని.. రీసర్వేలోనూ వ్యవసాయ భూమి విస్తీర్ణం 3,862 ఎకరాలుగా చూపారని.. భూమిలో ఏవిధమైన మార్పు లేదన్నారు. భూములను ఆన్‌లైన్ చేసిన సందర్భంలో రెవెన్యూ రికార్డులను తారుమారు చేశారని తహసీల్దార్ సుందర్‌సింగ్‌కు వివరించారు. అనర్హులను 1బీలో నమోదు చేయటం వల్ల అర్హులు రోడ్డున పడ్డామన్నారు. క్షేత్రస్థాయిలో రెవెన్యూ సిబ్బంది సక్రమంగా పనిచేయడం లేదని అసహనం వ్యక్తం చేశారు. కాళ్ళలో రీసర్వే జరిగి చాలాకాలం అయినా.. ఆ వివరాలు నోటీసు బోర్డులో ప్రదర్శించకుండా గోప్యత ఎందుకు పాటిస్తున్నారు అని ప్రశ్నించారు. ఒక్కొక్క రైతుకు ఎకరాకు 2 సెంట్ల నుంచి 40 సెంట్లు భూమి వ్యత్యాసం చూపిస్తున్నారని వాపోయారు.