
గూడెంలో మట్టి అక్రమ తవ్వకాలు
తాడేపల్లిగూడెం రూరల్: మండలంలో మట్టి అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. చేలు, చెరువులు అనే తేడా లేకుండా మట్టిని తవ్వి తరలిస్తున్నారు. ప్రధానంగా జగన్నాథపురం, మాధవరం, కొమ్ముగూడెం తదితర గ్రామాల్లోని చెరువులను టార్గెట్ చేసుకుని జేసీబీల సాయంతో మట్టి తవ్వి ట్రాక్టర్లు, టిప్పర్ లారీల్లో తరలిస్తున్నారని స్థానికులు పేర్కొంటున్నారు. తద్వారా మట్టి బకాసురులు సొమ్ము చేసుకుంటున్నారు. చేలు, చెరువుల్లో మట్టిని తవ్వి ఇతర ప్రాంతాలకు తరలించాలంటే సంబంధిత శాఖ అనుమతులు తీసుకోవాలి. అయితే మట్టి బకాసురులు మాత్రం అవేమీ లేకుండానే మట్టిని తవ్వి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. మట్టి అక్రమ తవ్వకాలు చేస్తున్న వారిని ప్రశ్నిస్తే నియోజకవర్గ స్థాయి ప్రజాప్రతినిధి పేరును ప్రస్తావించడం గమనార్హం. గతంలో కొమ్ముగూడెం గ్రామంలోని చెరువులో మట్టి అక్రమ తవ్వకాలను స్థానికులు అడ్డుకున్న ఘటనలు ఉన్నాయి. ఇవేమీ పట్టనట్లుగా బకాసురులు తిరిగి యథావిధిగా మట్టి తవ్వకాలు చేస్తున్నారు. ఉదయం, రాత్రి సమయాల్లో మట్టి అక్రమ తవ్వకాలు పెద్ద ఎత్తున సాగుతున్నాయని సమాచారం. ఇంత జరుగుతున్నా సంబంధిత శాఖ అధికారులు మిన్నకుండటంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
చోద్యం చూస్తున్న అధికార యంత్రాంగం