భీమవరం (ప్రకాశం చౌక్) : అమరజీవి పొట్టి శ్రీరాములు జీవితం ఆదర్శనీయమని కలెక్టర్ సీహెచ్ నాగరాణి అన్నారు. ఆదివారం బీసీ సంక్షేమ శాఖ, ఆర్యవైశ్య సంఘాల ఆధ్వర్యంలో జరిగిన పొట్టి శ్రీరాములు జయంతి కార్యక్రమాలకు ఆమె హాజరయ్యారు. పట్టణంలోని మావుళ్లమ్మ గుడి వద్ద పొట్టి శ్రీరాములు విగ్రహానికి ఆమె పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గాంధీజీ బోధించిన సత్యం, అహింస, హరిజనోద్ధరణకు పొట్టి శ్రీరాములు జీవితాంతం కృషిచేశారన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన పొట్టి శ్రీరాములు ఆదర్శనీయులని పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. జేసీ టి.రాహుల్‌కుమార్‌రెడ్డి, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి జి.గణపతిరావు, అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు, తహసీల్దార్ రావి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.