
నరసాపురంలోని 7వ వార్డులో పోలింగ్ కేంద్రాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్ ప్రశాంతి
కలెక్టర్ ప్రశాంతి
నరసాపురం: పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో అధికారులు ఎన్నికల నిర్వహణకు సంబంధించిన పనులపై దృష్టి పెట్టాలని కలెక్టర్ పి.ప్రశాంతి ఆదేశించారు. ముఖ్యంగా నియోజకవర్గాల వారీగా పోలింగ్ స్టేషన్‌ల స్థితిగతులపై తక్షణం నివేదికలు అందజేయాలన్నారు. గురువారం ఆమె పట్టణంలోని 7వ వార్డు, నరసాపురం మండలం పసలదీవి, మొగల్తూరు మండలం పేరుపాలెం నార్త్ పోలింగ్ కేంద్రాలను ఆమె పరిశీలించారు. ఇప్పటి నుంచే ప్రాథమికంగా పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేశారు. ఎన్నికల నిబంధనలు తప్పక పాటించాలన్నారు. ప్రతి రెండు కిలోమీటర్ల పరిధిలోపు ఒక పోలింగ్ స్టేషన్ ఉండేలా చూడాలని ఆదేశాలు ఉన్నాయని, ఈ దిశగా చర్యలు చేపట్టాలన్నారు. పోలింగ్ కేంద్రాల విషయంలో మార్పులు, చేర్పులు ఉంటే వెంటనే నివేదికలు అందజేయాలని సూచించారు.
1,500 ఓటర్లు దాటితే అదనపు కేంద్రం
1,500 మంది ఓటర్లు దాటి ఉన్న ప్రాంతాల్లో అదనపు పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయాలని, అలాంటి ప్రాంతాలను గుర్తించాలని కలెక్టర్ సూచించారు. పోలింగ్ కేంద్రాల వద్ద అన్ని వసతులు ఉండాలని, దివ్యాంగుల కోసం ప్రత్యేక ర్యాంపులు సిద్ధం చేయాలన్నారు. పోలింగ్ కేంద్రాల ఏర్పాటు విషయంలో అన్ని రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహించి వారి అభిప్రాయాలను, ప్రజల విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. ఇన్‌చార్జి సబ్ కలెక్టర్ కె.కృష్ణవేణి, తహసీల్దార్లు ఎండీ ఫాజిల్, జి.అనితాకుమారి, మున్సిపల్ కమిషనర్ కె.వెంకటేశ్వరరావు ఉన్నారు. అలాగే కలెక్టర్ ప్రశాంతి పాలకొల్లు మండలం కొత్తపేట పంచాయతీ పరిధిలోని పెంకుళ్లపాడు, పాలకొల్లు 20వ వార్డు ఎస్సీ కాలనీలో మార్పు చేసిన పలు పోలింగ్ స్టేషన్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.