భీమవరంలో విజేతలకు బహుమతులు అందజేస్తున్న అధికారులు, నిర్వాహకులు
ఆకట్టుకున్న జిల్లాస్థాయి యువజనోత్సవాలు
సాక్షి, భీమవరం: భీమ వరం ఎస్‌ఆర్‌కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో గురువారం జిల్లాస్థాయి యువ జనోత్సవాలు ఉత్సాహభరిత వాతావరణంలో సాగాయి. జిల్లా యువజన సర్వీసుల శాఖ, సెట్‌వెల్ ఆధ్వర్యంలో జానపద నృత్యాలు ఫోక్ డ్యాన్స్ వంటి విభాగాల్లో విద్యార్థులకు పోటీలు నిర్వహించారు. సెట్‌వెల్ సీఈఓ ఎండీహెచ్ మెహ రాజ్ అధ్యక్షతన జరిగిన ముగింపు కార్యక్రమంలో ఎస్‌ఆర్‌కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ ఎం.జగపతిరాజు, ఉపాధ్యక్షుడు సాగి విఠల్ రంగ రాజు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం యువతను చైతన్యం చేసేందుకు ఏర్పాటుచేసిన కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. తణుకు ఎస్‌కేఎస్‌డీ మహిళా కళాశాల విద్యార్థినులు పలు విభాగాల్లో సత్తాచాటి బహుమతులు గెలుచుకున్నారు. డిస్ట్రిక్ట్ యూత్ కో–ఆర్డినేటర్ ప్రవీణ్ కిషోర్, సెట్‌వెల్ సూపరింటెండెంట్ కేజే కెనడి, పి.ప్రసాద్, డాన్స్ మాస్టర్ జి.రాజేష్ పాల్గొన్నారు.
విజేతలు వీరే..
● ఫోక్‌డాన్స్ సోలో.. కె.ఖ్యాతి (ఎస్‌కేఎస్‌డీ తణుకు), లక్ష్మీ ప్రసన్న (ఎస్‌ఆర్‌కేఆర్), జీవై లక్ష్మి (ఎస్‌కేఎస్‌డీ తణుకు) మొదటి మూడు స్థానాల్లో నిలిచారు.
● స్టోరీ రైటింగ్.. ఐ.వెన్నల గ్రేస్ (ఎస్‌కేఎస్‌డీ తణుకు), వి.సత్య వరలక్ష్మి (ఎస్‌కేఎస్‌డీ తణుకు), వి.సాహితి స్ఫూర్తి (ఎస్‌కేఎస్‌డీ తణుకు) మొదటి మూడు స్థానాల్లో నిలిచారు.
● ఫోక్ డ్యాన్స్ గ్రూప్.. ఖ్యాతి గ్రూప్ (ఎస్‌కేఎస్‌డీ తణుకు) విజేతగా నిలిచింది.
● ఫోక్ సాంగ్ సోలో.. కె.చిన్ని బాబు (ఎస్‌కేఎస్‌డీ తణుకు), కె.సుస్మిత (ఎస్‌ఆర్‌కేఆర్ భీమవరం), సీహెచ్ సాయిరాం (ఎస్‌ఆర్‌కేఆర్,భీమవరం) మొదటి మూడు స్థానాల్లో నిలిచారు.
మొక్కుబడిగా ముగించి..
జిల్లాలోని 20 మండలాలు, భీమవరం, పాలకొల్లు, నరసాపురం, తాడేపల్లిగూడెం, తణుకు, ఆకివీడు పట్టణాల్లో ఇంజనీరింగ్, డిగ్రీ, పాలిటెక్నిక్, జూనియర్ కళాశాలలు ఉన్నాయి. అయినా యువజనోత్సవాల్లో కేవలం తణుకు ఎస్‌కేఎస్‌డీ మహిళా కళాశాల, భీమవరం ఎస్‌ఆర్‌కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు మాత్రమే పాల్గొన్నారు. దీంతో యువజనోత్సవాలు మొక్కబడిగా సాగాయి.


