
ఏలూరు(మెట్రో): గ్రామాల్లో కొత్తగా లేఅవుట్ల ఏర్పాటుకు అమల్లో ఉన్న నిబంధనలతోపాటు పరిపాలనకు సంబంధించి 6 అంశాలపై పంచాయతీ కార్యదర్శులకు నిర్వహిస్తున్న శిక్షణా కార్యక్రమంలో స్టేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ ఆఫ్ జీఎస్‌డబ్ల్యూఎస్(ఏపీఎస్‌ఐఆర్ డీపీఆర్) డైరెక్టర్ జె.మురళి పాల్గొన్నారు. గురువారం స్ధానిక జిల్లా పంచాయతీ వనరుల కేంద్రంలో ఉమ్మడి జిల్లా పరిధిలోని గ్రేడ్– 1 నుంచి గ్రేడ్–5 వరకు గల పంచాయతీ కార్యదర్శులకు శిక్షణ నిర్వహించారు. ఈ సందర్బంగా జె.మురళీ మాట్లాడుతూ గ్రామాల్లో కొత్త లేఅవుట్లకు సంబంధించి నిబంధనల అమలుపై పంచాయతీ కార్యదర్శులకు పూర్తిస్ధాయి అవగాహన ఉండాలన్నారు. కొత్త లేఅవుట్ ఏర్పాటు, పరిపాలనా విధానం, హక్కులు, బాధ్యతలు, పంచాయతీ చట్టం, ఉపాధిహామీ పనులు, వైఎస్‌ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు, తదితర అంశాలపై శిక్షణ ఇస్తున్నామన్నారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈవో కెవీఎస్‌ఆర్ రవికుమార్, ఏపీఎస్‌ఐఆర్ డీపీఆర్ జాయింట్ డైరెక్టర్ వై.దోసిరెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి టి.శ్రీనివాస్ విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు.
