
జాజికాయ జాపత్రి
తాడేపల్లిగూడెం: సుగంధ ద్రవ్యాల్లో జాజికాయ, జాపత్రిల ప్రత్యేకత వేరు. వంటకాలకు ప్రత్యేక రుచిని అందించే ఈ సుగంధ ద్రవ్యాల్ని ఇప్పుడు ఉమ్మడి పశ్చిమలో పండించేందుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. ఈ పంట రాబోయే రోజుల్లో జిల్లాలో విస్తరించడానికి ఉద్యానవర్సిటీ ప్రయత్నాలు చేస్తోంది.
జాజికాయ, జాపత్రి ఒకే చెట్టు నుంచి వస్తాయి. రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో వైఎస్‌ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం మార్గదర్శకత్వంలో పామాయిల్, కొబ్బరి తోటల్లో అంతరపంటగా జాజికాయ మొక్కలు పెంచేలా ఉద్యాన వర్సిటీ రైతులను కార్మోన్ముఖుల్ని చేస్తుంది. ఈ మొక్కల పెంపకంలో మెళకువలు నేర్చుకొనేందుకు ఉద్యానవర్సిటీ పరిధిలోని కృషివిజ్ఞాన కేంద్రం రైతులు కేరళ వెళ్లి వచ్చారు.ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఎం.మురళీకృష్ణ వంటి అభ్యుదయ రైతులు ఈ సాగులో సత్ఫలితాలు సాధించారు. జాజికాయ సాగు లాభాలు రైతుల్ని ఆకర్షిస్తున్నాయి.
లాభాల పంటే,..
మిరిస్టికా ప్రాగ్రెన్స్ అనే శాసీ్త్రయ నామంతో పిలిచే జాజికాయ సుగంధద్రవ్య పంటగా ఖ్యాతినొందింది. 25 నుంచి 35 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో పెరిగే ఈ మొక్కల సాగుపై సుదీర్ఘ పరిశోధన జరుగుతూనే ఉంది. కేరళలోని ఐసీఏఆర్, ఐఐఎస్‌ఆర్, కేరళ వ్యవసాయ విశ్వవిద్యాలయం, సుగంధ ద్రవ్యాల బోర్డు జాజికాయ మీద విస్తృత పరిశోధనలు చేశాయి. విశ్వశ్రీ, కేరళశ్రీ, కొంకణ్ సుగంధ, కొంకణ్ స్వాధ్, నోవా, కల్లింగల్ వంటి రకాలు సాగుకు అనుకూలంగా ఉన్నట్టు తేల్చారు. ఎపికోటైల్ గ్రాప్టింగ్ ద్వారా వాణిజ్యపరంగా జాజికాయ మొక్కలు పెంచుతున్నారు. ఉద్యాన అధికారులు సిఫార్సు చేసిన మొక్కలను పామాయిల్, కొబ్బరి తోటల్లో అంతర పంటగా నాటుకోవచ్చు. వక్కతో కలిపి కూడా సాగు చేసుకోవచ్చు. ఎక్కువగా తెగుళ్లు ఆశించని ఈ మొక్కలు ఐదు నుంచి ఆరు సంవత్సరాలలో పంటను అందిస్తాయి. పువ్వులు పూసిన ఏడు నుంచి తొమ్మిది నెలల్లో పండ్లు కోసి, బాహ్య భాగాన్ని వేరుచేసి జాపత్రిని, జాజికాయను వేరుచేస్తారు. తర్వాత మార్కెటింగ్ చేసుకోవచ్చు.
దిగుబడి ఇలా
500 కాయల నుంచి కిలో జాపత్రి వస్తుంది. 100 కాయల నుంచి కిలో జాజికాయలు వస్తాయి. కాయ తొక్క నుంచి క్యాన్సర్‌ను నివారించే వైన్ తయారీకి ప్రయత్నాలు జరుగుతున్నాయి. పశువులు, కోతులు, మేకలతో ఎలాంటి ఇబ్బంది ఉండదు.
ఉపయోగాలెన్నో...
జాజికాయలో ఉండే మిరిస్టిసిస్ మెదడు చురుగ్గా పనిచేసేందుకు సహకరిస్తుంది. మతిమరుపు లక్షణాలను తొలగిస్తుంది. శరీరంలోని వ్యర్థాలను పూర్తిగా తొలగించే శక్తి జాజికాయకు ఉంది. మూత్రపిండాల్లో ఉన్న రాళ్లను కరిగించడంలో, మానసికలొత్తిడి తగ్గించడంలో ఇవి క్రియాశీలక భూమిక పోషిస్తాయి. వీర్యకణాల ఉత్పత్తిని వృద్ధి చేస్తుంది.
ఉమ్మడి పశ్చిమలో..,
ఉమ్మడి పశ్చిమలో కలవపల్లికి చెందిన ఎం.మురళీకృష్ణ అనే అభ్యుదయ రైతు చాలా సంవత్సరాలుగా జాజికాయ మొక్కలను పెంచుతున్నారు. 2016లో పెంపకానికి చుట్టారు. ఆయిల్ ఫాం తోటల్లో అంతరసాగుగా వీటి పెంపకాన్ని చేపట్టారు. కేవీకే ఆత్మల సహకారంతో మేలు ఫలితాలు పొందుతున్నారు.
కేవీకే ప్రత్యేక దృష్టి
అంటుపద్ధతిలో జాజికాయ మొక్కలను తయారు చేసి, ఆశక్తి ఉన్న రైతులకు తక్కువ ధరకు అందించే విషయంపై ఉద్యానవర్సిటీ పరిధిలోని కృషి విజ్ఞాన కేంద్రం ప్రత్యేక దృష్టి సారించింది. ఆసక్తి కలిగిన రైతులతో కలిపి వర్సిటీ వీసీ టి.జానకీరామ్ పర్యవేక్షణలో విస్తరణ సంచాలకులు ఇ.కరుణశ్రీ నేతృత్వంలో కేరళ కోజికోడ్‌లో గత నెలలో రైతులకు శిక్షణ ఇచ్చారు. ఒక గ్రాఫ్ట్ 250 రూపాయల నుంచి వెయ్యి రూపాయల ధర ఉంది. పెద్దచెట్లు ఉన్న రైతులు తక్కువకే ఈ మొక్కలను పొందడానికి గ్రాఫ్ట్ లేదా అంటుకట్టుకోవడానికి ఈ శిక్షణ ఉపయోగపడింది. ఈ తరహా శిక్షణా కార్యక్రమం తొలిసారిగా చేపట్టినట్టు విస్తరణ సంచాలకులు ఇ.కరుణశ్రీ తెలిపారు. జిల్లాలో పామాయిల్, కొబ్బరి, వక్క పంటల్లో అంతరసాగుగా జాజికాయ మొక్కలను పెంచడానికి అనువైన వాతావరణం ఉంది.
ఉమ్మడి పశ్చిమలో విస్తరణకు యాక్షన్ ప్లాన్
ఉద్యాన వర్సిటీ ఆధ్వర్యంలో మార్గదర్శనం
జాజికాయ పంటను ప్రోత్సహిస్తాం
జాజికాయ సాగును ప్రోత్సహించడానికి ఉద్యాన వర్సిటీ కృషి చేస్తుంది. అంతర పంటగా బహువార్షిక మొక్క జాజికాయ. ఈ సాగును రాష్ట్రంలో విస్తరించే క్రమంలో రైతులకు నైపుణ్య శిక్షణ ఇప్పించాం. కలవపల్లి గ్రామంలో పది సంవత్సరాల వయస్సు కలిగిన జాజికాయ మొక్కలు ఆశాజనకమైన దిగుబడులు అందిస్తున్నాయి. రైతులు వీటి పెంపకంపై ఆసక్తి కనపరుస్తున్నారు. జాజికాయ మొక్కల ప్రవర్ధనంపై ప్రత్యేక శిక్షణను రైతులకు ఇప్పించాం. ఈ ప్రాంతంలోనే జాజికాయ మొక్కలను అందుబాటులో తేవడానికి వర్సిటీ కృషి చేస్తుంది.
– డాక్టర్ తోలేటి జానకీరామ్, ఉపకులపతి, డాక్టర్ వైఎస్‌ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం

