పూర్తయిన ఇల్లు.. జాడలేని బిల్లు! | - | Sakshi
Sakshi News home page

పూర్తయిన ఇల్లు.. జాడలేని బిల్లు!

Jun 22 2026 1:06 AM | Updated on Jun 22 2026 1:06 AM

నిర్మాణాలకు అనుగుణంగా ఖాతాల్లోకే డబ్బులు

నెలలుగా ‘ఇందిరమ్మ’ లబ్ధిదారుల ఎదురుచూపులు

పక్క ఫొటోలో కనిపిస్తున్నది హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం కేంద్రంలో పూర్తయిన ఇందిరమ్మ ఇల్లు ఇది. లబ్ధిదారు అప్పు చేసి ఇంటి నిర్మాణం పూర్తి చేసుకున్నాడు. ఇల్లు పూర్తయి నాలుగు నెలలు గడుస్తున్నా ఫైనల్‌ బిల్లు (రూ.1.50 లక్షలు) ఇంకా ఖాతాలో పడలేదు. బిల్లు ఇవ్వాలని కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేదు. ఇది ఈ ఒక్క లబ్ధిదారుడి పరిస్థితే కాదు.. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని వరంగల్‌, హనుమకొండ, జనగామ, మహబూబాబాద్‌, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు జిల్లాలోని అనేక మంది లబ్ధిదారులు ఈ సమస్య ఎదుర్కొంటున్నారు.

సాక్షిప్రతినిధి, వరంగల్‌:

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ గృహనిర్మాణ పథకంలో భాగంగా ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు పెద్దఎత్తున ఇళ్లను మంజూరు చేసింది. హనుమకొండ, వరంగల్‌, జనగామ, మహబూబాబాద్‌, ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాల్లో వేలాది ఇళ్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. అయితే పునాది, లింటెల్‌, స్లాబ్‌ దశలు పూర్తిచేసిన లబ్ధిదారులకు బిల్లుల విడుదల ఆలస్యం అవుతోంది. ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల మేరకు నిర్మాణాలు పూర్తిచేసి, గృహప్రవేశాలు కూడా చేశారు.

అప్పుచేసి ఇళ్ల నిర్మాణం.. గృహప్రవేశం చేసినా చివరి బిల్లు పెండింగ్‌

ఇందిరమ్మ గృహ పథకం కింద మంజూరైన ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం విడతల వారీగా ఆర్థిక సాయం అందిస్తోంది. అయితే, నిర్మాణ సామగ్రి ధరలు పెరగడం, కూలీల ఖర్చులు అధికమవడంతో ప్రభుత్వం విడుదల చేసే మొత్తానికి మించి ఖర్చు అవుతోంది. దీంతో లబ్ధిదారులు ప్రైవేట్‌ అప్పులు, చిట్టీలు, బంగారు నగల తాకట్టు వంటి మార్గాలను ఆశ్రయించి ఇళ్లను పూర్తి చేస్తున్నారు. చాలామంది లబ్ధిదారులు ఇంటి నిర్మాణం పూర్తి చేసి గృహప్రవేశాలు నిర్వహించినా తుది విడత బిల్లులు ఇంకా అందలేదని వాపోతున్నారు. అధికారులు నిర్మాణం పూర్తయినట్లు నమోదు చేసినప్పటికీ నిధుల విడుదలలో జాప్యం జరుగుతోందని చెబుతున్నారు. కొందరు చెల్లింపుల కోసం మూడు నుంచి ఆరు నెలలుగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.

‘ఇందిరమ్మ’ మొదటి విడత ఇలా..

ఉమ్మడి వరంగల్‌లోని ఆరు జిల్లాల్లో మొదటి విడత 42 వేల ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందులో 35,417 ఇళ్లకు మార్క్‌ఔట్‌ చేసి నిర్మాణాలు మొదలు పెట్టారు. ఇప్పటివరకు దాదాపు 10,500 ఇళ్ల నిర్మాణాలు పూర్తయినట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి. వీటిలో గణనీయమైన సంఖ్యలో లబ్ధిదారులు గృహప్రవేశాలు చేసినప్పటికీ తుది బిల్లులు అందక ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు వేలాది ఇళ్లు వివిధ దశల్లో కొనసాగుతున్నాయి.

గృహప్రవేశం చేసినా

ఖాతాల్లో జమ చేయని ప్రభుత్వం

పునాదుల నుంచి పైకప్పు వరకు

అప్పులు చేసి నిర్మాణం

ఉమ్మడి జిల్లాలో మొదటి విడత

42 వేల ఇళ్లు మంజూరు..

పూర్తయినవి 10,500 గృహాలు

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వివిధ దశలను బట్టి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతున్నాయి. ఆలస్యం జరడం లేదు. బిల్లుల చెల్లింపులకు మధ్య కాంట్రాక్టర్లు ఎవరూ ఉండరు. డైరెక్ట్‌గా బబెనిఫిషరీ అకౌంట్లో పడతాయి. అర్బన్‌లో ఇళ్ల నిర్మాణానికి పీఎంఏవైతో లింక్‌ అప్‌ అవడం వల్ల కేంద్రం నుంచి నిధుల విడుదల ఆలస్యం అవుతోంది. – సిద్ధార్థ్‌నాయక్‌, పీడీ, హౌసింగ్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement