నిమిషం ఆలస్యమైతే నో ఎంట్రీ | - | Sakshi
Sakshi News home page

నిమిషం ఆలస్యమైతే నో ఎంట్రీ

Jun 21 2026 12:43 AM | Updated on Jun 21 2026 12:43 AM

నిమిషం ఆలస్యమైతే నో ఎంట్రీ

కేయూ క్యాంపస్‌: వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశాలకు ఈనెల 21 (ఆదివారం)న నీట్‌ నిర్వహించేందుకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. హనుమకొండ, వరంగల్‌, కాజీపేటలో 13 పరీక్ష కేంద్రాలను ఏర్పాటుచేశారు. 4,676 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5–15 గంటల వరకు నీట్‌ నిర్వహించనున్నారు. దివ్యాంగ అభ్యర్థులకు అదనంగా ఒక గంటపాటు పరీక్ష రాసే అవకాశం కల్పించారు. పరీక్ష నిర్వహణ కోసం 13 మంది చీఫ్‌ సూపరింటెండెంట్లు, ప్రతీ పరీక్ష కేంద్రానికి ఒక అబ్జర్వర్‌, ఇన్విజిలేటర్లను నియమించారు. ఉదయం 11–30 నుంచి మధ్యాహ్నం 1–30 గంటల వరకే పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు. ఆ తర్వాత పరీక్ష కేంద్రాల గేట్లను మూసివేస్తారు. నిర్దేశించిన సమయానికి ఒక్క నిమిషం ఆలస్యమైనా కేంద్రాల్లోకి అనుమతించరు. ఇప్పటికే ఎన్‌టీఏ నీట్‌ ప్రశ్నపత్రాలను సురక్షితంగా చేరవేసింది.

ఆర్టీసీ బస్సులు కూడా అందుబాటులో..

నీట్‌ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల కోసం ఆర్టీసీ బస్సులను నడపనుంది. వరంగల్‌ పీఎంశ్రీ కేంద్రీయ విద్యాలయం పరీక్ష కేంద్రానికి ప్రత్యేకంగా రవాణా సదుపాయం కల్పించినట్లు అధికారులు తెలిపారు. ప్రతీ పరీక్ష కేంద్రంలో ప్రథమ చికిత్స సదుపాయం, అవసరమైన వైద్య సిబ్బందిని కూడా అందుబాటులో ఉంచనున్నారు. నీట్‌ జిల్లా కో–ఆర్డినేటర్‌గా కేంద్రీయ విద్యాలయం ఇన్‌చార్జ్‌ ప్రిన్సిపాల్‌ భిక్షపతి వ్యవహరిస్తున్నారు.

పరీక్ష కేంద్రాలివే..

హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల, వరంగల్‌ నిట్‌లో రెండు కేంద్రాలు, వరంగల్‌లోని సీకేఎం కళాశాల, హనుమకొండలోని ప్రభుత్వ కోఎడ్యుకేషన్‌ జూనియర్‌ కళాశాల, కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, సుబేదారిలోని యూనివర్సిటీ పీజీ కళాశాల, వడ్డేపల్లిలోని ప్రభుత్వ పింగిళి జూనియర్‌ కళాశాల, ప్రభుత్వ పింగిళి మహిళా డిగ్రీ కళాశాల, పీఎంశ్రీ ప్రభుత్వ ప్రాక్టీసింగ్‌ హైస్కూల్‌, వరంగల్‌లోని పీఎంశ్రీ కేంద్రీయ విద్యాలయం, ఎల్‌బీ కళాశాల, ఎల్‌బీ కాలేజీ ఎడ్యుకేషన్‌లో పరీక్ష కేంద్రాలు కేటాయించారు.

సీకేఎం కళాశాల కేంద్రాన్ని

సందర్శించిన వరంగల్‌ కలెక్టర్‌

పలు పరీక్ష కేంద్రాల్లో శనివారం మాక్‌డ్రిల్‌ నిర్వహించారు. వరంగల్‌లోని సీకేఎం కళాశాల పరీక్ష కేంద్రాన్ని వరంగల్‌ కలెక్టర్‌ సత్యశారద, అదనపు కలెక్టర్‌ గణేశ్‌ సందర్శించారు. ఎలా ఉన్నాయో పరిశీలించారు. నీట్‌ జిల్లా కోఆర్డినేటర్‌ భిక్షపతి హనుమకొండలోని పింగిళి ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, పింగిళి మహిళా కళాశాల కేంద్రాలను పరిశీలించారు.

నేడు నీట్‌ పరీక్ష..

అధికారుల ఏర్పాట్లు

13 కేంద్రాలు..

4,676 మంది అభ్యర్థులు

మధ్యాహ్నం 1:30 గంటల తర్వాత గేట్ల మూసివేత

పరీక్ష కేంద్రాల వద్ద బందోబస్తు

వరంగల్‌ క్రైం: నీట్‌ పరీక్ష కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ప్రీత్‌సింగ్‌ అధికారులను అదేశించారు. క్యాంపు కార్యాలయం నుంచి శనివారం పోలీస్‌ అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ప్రతి కేంద్రంలో ఒక ఇన్‌స్పెక్టర్‌ స్థాయి అధికారి పర్యవేక్షణలో పోలీసులు బందోబస్తు నిర్వహించాలని, పరీక్ష కేంద్రంలోకి వచ్చే ప్రతి విద్యార్థిని తనిఖీ చేయాలని పేర్కొన్నారు. ఎలాంటి ఎలక్టాన్రిక్‌ పరికరాలను అనుమతించవద్దని, పరీక్ష కేంద్రం వద్ద సీఆర్పీ ఎఫ్‌ సిబ్బంది సైతం విధులు నిర్వర్తిస్తారని, స్థానిక పోలీసులు సమన్వయంతో కలిసి పనిచేయాలని ఆయన సూచించారు. పరీక్ష పత్రాలను కేంద్రాలకు తరలించే సమయంలో పాటు పరీక్ష అనంతరం పరీక్ష పత్రాలను సేఫ్‌ హౌస్‌లకు తరలించే సమయంలో పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. పరీక్ష కేంద్రం పరిసరాల్లో ముమ్మరంగా పెట్రోలింగ్‌ నిర్వహించడంతో పాటు పరీక్ష జరిగే ప్రాంతంలో జిరాక్స్‌ సెంటర్లు మూసివేయించాలని, ఎలాంటి పుకార్లు ప్రచారం కాకుండా జాగ్రత్త తీసుకోవాలని, సోషల్‌ మీడియాలో వచ్చే కథనాలపై స్టేషన్‌ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని పోలీస్‌ కమిషనర్‌ అధికారులను ఆదేశించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement