ఎల్కతుర్తి: పారిశుద్ధ్యం, పచ్చదనం, నాణ్యమైన విద్య గ్రామాభివృద్ధిలో కీలకమని కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ అన్నారు. జీల్గుల గ్రామంలో శుక్రవారం ఆమె పర్యటించారు. సెగ్రిగేషన్ షెడ్, ఉపాధి హామీ పనులు, ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాల్లో చెత్తను శాసీ్త్రయంగా నిర్వహిస్తే కంపోస్ట్ ఎరువు తయారవుతుందని తెలిపారు. ఊర చెరువు మట్టిని వ్యవసాయ భూములకు తరలించడం ద్వార భూసారం పెరిగి రైతులకు లాభం చేరుకూరుతుందని పేర్కొన్నారు. గ్రామస్తులు ఉపాధి హామీ పనులకు వెళ్లడం సంతోషకరమని పేర్కొన్నారు. చెరువు కట్ట చుట్టూ విస్తృతంగా మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించాలని సూచించారు. అనంతరం ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను సందర్శించిన కలెక్టర్ విద్యార్థుల అభ్యసన స్థాయిలను పరిశీలించారు. ప్రభుత్వం పంపిణీ చేసిన పాఠ్యపుస్తకాలు అందాయా లేదా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో నేరుగా మమేకమైన కలెక్టర్ సాంఘికశాస్త్రంలోని అంశాలు, భారతదేశ భౌగోళిక స్వరూపం, సరిహద్దుల గురించి వివరించారు. ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన విద్యార్థులను అభినందించారు. బడిబాటలో విద్యార్థుల నమోదు పెంచేందుకు చర్యలు చేపట్టాలని హెచ్‌ఎంను ఆదేశించారు. మధ్యాహ్న భోజన పథకం అమలును పరిశీలించి విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు. అనంతరం వనమహోత్సవం సందర్భంగా పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. డీఆర్‌డీఓ మేన శ్రీను, డీఈఓ గిరిరాజ్‌గౌడ్, తహసీల్దార్ ప్రసాద్‌రావు, ఎంపీడీఓ విజయ్‌కుమార్, ఏపీఏం అనిత, సర్పంచ్‌లు తదితరులు పాల్గొన్నారు.
పచ్చదనం, పారిశుద్ధ్యం, విద్యతోనే గ్రామాభివృద్ధి సాధ్యం
కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్..
జీల్గుల గ్రామంలో పర్యటన


