వరంగల్ అర్బన్: ఏళ్ల తరబడి పెచ్చులూడుతున్నాయి. అడపాదడపా ప్రమాదాలు జరుగుతున్నాయి. వర్షపు నీరు స్లాబ్ వెంట జారుతోంది. చాంబర్లలోని రికార్డులు, కంప్యూటర్లు, దస్త్రాలు, ఫర్నిచర్ తడుస్తున్నాయి. వర్షపు నీటితో షార్ట్‌సర్క్యూట్ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఇలా.. ఏళ్లుగా ఇబ్బంది పడుతున్నారు బల్దియా అధికారులు, సిబ్బంది. బల్దియా భవనం జీవిత కాలం ముగిసి, ప్రస్తుతం అవసాన దశకు చేరుకుంది. నిర్వహణ లోపంతో మరింత శిథిల దశకు చేరింది.
1970లో ఇక్కడి నుంచి సేవలు..
బల్దియా భవనం నిజాం కాలంలో హనుమకొండ కాంగ్రెస్ భవనానికి సమీపంలో ఉండేది. అది శిథిలావస్థకు చేరడంతో.. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి సమీపంలోకి తరలించారు. 1968 డిసెంబర్ 22న అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి చేతుల మీదుగా బల్దియా భవనానికి ఫౌండేషన్ వేశారు. 1970 ఫిబ్రవరి 1న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గోపాల్ రావు ప్రారంభించారు. తదుపరి గ్రౌండ్ ఫ్లోర్‌తోపాటు రెండు అంతస్తులల భవా నాన్ని నిర్మించగా, అప్పటి పురపాలక శాఖ మంత్రి ఉమారెడ్డి ప్రారంభించారు. అప్పటి వరకు సెలక్షన్ గ్రేడ్ మున్సిపాలిటీగా ఉన్న బల్దియా 1994లో మున్సిపల్ కార్పొరేషన్‌గా అవిర్భవించింది. 2015లో వరంగల్ మహా నగర పాలక సంస్థగా అవతరించింది.
విస్తరణ..
49.16 చదరపు కిలోమీటర్లు ఉన్న పట్టణ పరిధిలో 1994 నాటికి 110 చదరపు కిలోమీటర్లకు చేరింది. గ్రేటర్ వరంగల్‌తో అది 407.7 చదరపు కిలోమీటర్లకు విస్తరించింది. భవనంలోనే మేయర్, కమిషనర్, డిప్యూటీ మేయర్, వింగ్ అధికారులు, అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది ఇక్కడి నుంచి పరిపాలన సాగిస్తూ వచ్చారు. 2014లో కాశిబుగ్గ, కాజీపేట సర్కిల్ కార్యాలయాల ఏర్పాటుతో సగానికి పైగా 60 శాతం అధికారులు, సిబ్బంది అక్కడే సేవలు అందిస్తున్నారు. అయితే గత రెండు దశాబ్దాలుగా బల్దియా భవనం స్లాబ్ పెచ్చులు, గోడలు పెచ్చులు ఉడిపోతున్నాయి. బల్దియా అధి కారులు, ఉద్యోగులు బల్దియా ఇంజనీర్లు పదుల సంఖ్యలో మరమ్మతుల కోసం రూ.కోట్లు వెచ్చించా రు. కానీ, పెద్దగా ప్రయోజనం ఒనగూరలేదు. ఎట్ట కేలకు ఇన్‌చార్జ్ కమిషనర్ ఆదేశాలతో శిథిలావస్థకు చేరిన భవనం త్వరలో నేలమట్టం కానుంది. తదుపరి నగరవ్యాప్తంగా ఉన్న శిథిలావస్థకు చేరిన భవనాలపై కొరడా ఝుళిపించనున్నారు.
తాత్కాలికంగా మేయర్ భవనంలోకి..
బలహీనమైన బల్దియా పాత భవనాన్ని కూల్చివేసేందుకు రంగం సిద్ధమైంది. ఈనేపథ్యంలో కార్యాలయంలోని ప్రజారోగ్యం, మలేరియా, జనన, మరణ, అడ్మినిస్ట్రేటివ్, ట్రెజరరీ, పట్టణ ప్రణాళిక, ఇంజనీరింగ్ సెక్షన్, రికార్డు సెక్షన్, రికార్డులు సమీపంలో ఉన్న మేయర్ భవనంోకి విభాగాలను తాత్కలికంగా తరలిస్తున్నారు. పక్కనే పరిపాలన భవనం రూ.32 కోట్లతో నిర్మాణ దశలో ఉంది. ఈ భవనం పూర్తయితే ఇక్కడి నుంచి అందులోకి తరలించనున్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు.
బలహీనమైన బల్దియా భవనం
తాత్కాలికంగా మేయర్ భవనంలోకి చాంబర్ల తరలింపు


