వరంగల్ క్రైం: విధి నిర్వహణలో కర్తవ్యాన్ని నిర్వహిస్తూనే.. పిల్లల అభ్యున్నతికి కృషి చేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్ తెలిపారు. ప్రతిష్టాత్మక ముంబై ఐఐటీలో అడ్మిషన్ సాధించిన ఇన్‌స్పెక్టర్ కుమార్తెను వరంగల్ పోలీస్ కమిషనర్ ఘనంగా సత్కరించారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న సతీశ్ కుమార్తె యడ్లపల్లి సాత్విక జేఈఈ మెయిన్స్ పరీక్షలో 99.65 పర్సంటైల్ సాధించగా, ఇటీవల నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్ పరీక్షల్లో రాణించి 8,081 ర్యాంకుతో ముంబై ఐఐటీలోని సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో సీటు సాధించింది. వరంగల్ పోలీస్ కమిషనర్ సాత్వికను ఘనంగా సత్కరించారు. దేశంలోనే అత్యున్నత విద్యా సంస్థలో సీటు సాధించడం గొప్ప విషయమని, ఇదే రీతిలో కష్టపడి చదివి లక్ష్యాలు చేరుకోవాలన్నారు.
విద్యారణ్యపురి: భారత ప్రభుత్వ శాస్త్ర సాంకేతిక శాఖ ఆధ్వర్యంలో జాతీయ ఆవిష్కరణల సంస్థ (ఎన్‌ఐఎఫ్ ఇండియా) మైగౌట్‌తో సంయుక్తంగా నిర్వహిస్తున్న ‘తపన వేసవి అన్వేషణ’ జాతీయ పోస్టర్’ పోటీల్లో విద్యార్థులు పాల్గొనాలని హనుమకొండ డీఈఓ ఎల్‌వీ గిరిరాజ్‌గౌడ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆరో తరగతి నుంచి 8వ తరగతి విద్యార్థులకు ఈ పోటీలు ఉంటాయని పేర్కొన్నారు. ఈపోటీల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ముగ్గురికి సైన్స్ కిట్లు అందించనున్నట్లు, 50 మందికి శాస్త్రవేత్తల, విషయ నిపుణులచే ఏర్పాటు చేసిన ఆన్‌లైన్ కార్యాశాలలో పాల్గొనే అవకాశం కల్పించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. హెచ్‌ఎంలు, ప్రిన్సిపాళ్లు, స్పెషల్ ఆఫీసర్లు ప్రతీ పాఠశాల నుంచి విద్యార్థులను ప్రోత్సహించాలని డీఈఓ సూచించారు. పూర్తి వివరాలకు హనుమకొండ జిల్లా సైన్స్ అధికారి ఎస్.శ్రీనివాసస్వామి 94901 12848 నంబర్‌లో సంప్రదించాలని డీఈఓ సూచించారు.
హన్మకొండ అర్బన్: ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం (ఎస్‌ఐఆర్–26)పై ఓటర్లలో అవగాహన పెంపొందించేందుకు నేడు (గురువారం) 2 కే రన్ నిర్వహిస్తున్నట్లు హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ తెలిపారు. ఉదయం 7 గంటలకు హనుమకొండ అదాలత్ సర్కిల్‌లోని జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం వద్ద ప్రారంభమయ్యే ఈ రన్ కలెక్టరేట్ వరకు కొనసాగుతుందని పేర్కొన్నారు. అధికారులు, విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ కోరారు.
కేయూ క్యాంపస్: తెలంగాణ ఇంజనీరింగ్ కళాశాలల్లో లెటర్ ఎంట్రీ అడ్మిషన్ ప్రక్రియలో భాగంగా టీజీఈసెట్ అభ్యర్థులకు సర్టిఫికెట్ల పరిశీలన ప్రారంభమైంది. బుధవారం హనుమకొండలోని యూనివవర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల హెల్ప్ లైన్ సెంటర్‌లో సర్టిఫికెట్ల పరిశీలన ప్రారంభమైంది. పాలిటెక్నిక్ కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులు ఈ టీజీఈసెట్ కౌన్సిలింగ్ ప్రక్రియ ద్వారా ఇంజనీరింగ్ కళాశాలల్లోని కోర్సుల్లో రెండో సంవత్సరంలో ప్రవే శం పొందననున్నట్లు ఆకళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య ఎస్.జ్యోతి తెలిపారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయించుకున్న అభ్యర్థులకు ధ్రువపత్రాలను జ్యోతి అందజేశారు.


