ఖిలా వరంగల్: వానాకాలం సాగులో రైతులు సరైన విత్తన ఎంపిక, సస్యరక్షణ, యాజమాన్య పద్ధతులు పాటిస్తే ఆశించిన దిగుబడి సాధించవచ్చు. సరైన విత్తనాలు ఎంచుకుని సమగ్ర విధానాలు పాటిస్తే ఆశాజనకమైన దిగుబడులు వస్తాయని జిల్లా వ్యవసాయ అధికారి విజయ నిర్మల తెలిపారు. ప్రభుత్వ ధ్రువీకరణ పాందిన కంపెనీలు, ఏజెన్సీలు, సంస్థలకు చెందిన విత్తనాలే కొనుగోలు చేయాలని వెల్ల డించారు. విత్తనాలు కొనుగోలు చేసిన రశీదులు భద్రపర్చుకోవాలని సూచించారు. వానాకాలం పంటల సాగు నేపథ్యంలో సాక్షి ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన ఫోన్‌ఇన్ కార్యక్రమానికి అనూహ్య స్పందన వచ్చింది. రైతులు అడిగిన ప్రశ్నలకు జిల్లా వ్యవసాయ అధికారి విజయ నిర్మల సమాధానాలు చెప్పి వారి సందేహాలను నివృత్తి చేశారు.
ప్రశ్న: నారుమడిలో ఆకుకొనలు ఎర్రబడుతున్నాయి, కందిలో ఏ రకాలు సాగుచేయాలి?
(రైతులు కన్నె మహేందర్, నల్లబెల్లి, సీహెచ్.లింగమూర్తి దుగ్గొండి, టి.వెంకన్న, మాన్‌సింగ్ నెక్కొండ, రామచంద్రరెడ్డి వర్ధన్నపేట, పి.రాజు, కె.శ్రీను నెక్కొండ)
జవాబు: నారుమడిలో ఆకుల కొనలు ఎర్రబడడం లక్షణాలు పోషక లోపాల్ని సూచిస్తుంది. సూక్ష్మ పోషకాల మిశ్రమాన్ని పిచికారీ చేసుకుని నివారించుకోవచ్చు. అలాగే కందిలో ప్రధానంగా డబ్ల్యూఆర్‌జీఈ–97, 93, 255 డబ్ల్యూఆర్‌జీ–121, టీడీఆర్‌జీ–4 రకాల విత్తనాలు సాగు చేసుకోవచ్చు. వరిలో వానాకాలం పంట సాగుకు విశ్వవిద్యాలయ విడుదల చేసిన సన్న రకాలైన కేఎన్‌ఎం–1638, ఆర్‌ఎన్‌ఆర్ 15048, డబ్ల్యూజీఎల్–962, సిద్ధి డబ్ల్యూజీఎల్–44 అనుకూలం.చెరువు కింద దీర్ఘకాలిక వరి రకమైన సిద్ది (డబ్ల్యూజీఎల్–44) బాగుంటుంది..140 నుంచి 145 రోజులు పంటకాలం.
ప్రశ్న: రైతులకు అవగాహన సదస్సులు ఏర్పాటు
చేయాలి? – టి.వీరస్వామి, వెంకటాపూర్,
దుగ్గొండి మండలం
జవాబు: వ్యవసాయ శాఖ, విశ్వ విద్యాలయం సంయుక్తంగా నిర్వహిస్తున్న రైతు నేస్తం కార్యక్రమం రైతు వేదికల ద్వారా ప్రసారం చేయబడుతుంది. అలాగే మండల పరిధిలో అవగాహన కార్యక్రమాలు వ్యవసాయాధికారి నిర్వహిస్తారు.
ప్రశ్న: పత్తి సాగులో రకాలు.. పసుపు, మునగ సాగు లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు?
(రైతులు జి.నరేశ్, నల్లబెల్లి, పి.గణేశ్, దుగ్గొండి)
జవాబు: పత్తిలో నాణ్యమైన హైబ్రిడ్ రకాలను ఎంపిక చేసుకోవాలి. ముఖ్యంగా పంట వేసుకునేందుకు భూమి పూర్తిగా తడిసిన తర్వాతనే పత్తి విత్తనాలు విత్తుకోవాలి. పసుపు సాగులో ముఖ్యంగా ఆఖరి దుక్కి దున్నే ముందు మాగిన పశువుల ఎరువు చల్లుకోవాలి. ఆలాగే 200 కిలోల వేప పిండిని ఎకరానికి వేసుకోవాలి. విత్తనం ద్వారా సంక్రమించే చీడపీడలు, తెగుళ్లను అరికట్టడానికి విత్తనం శుద్ధి చేసుకోవడం ముఖ్యం. విత్తన శుద్ధికి దుంపను మూడు గ్రాముల రీడోమిల ఎంజెడ్ 0–3 మిల్లీ లీటర్ల ఇమిదాక్లో ప్రీడ్ లీటర్ నీటికి కలుపుకోవాలి. మునగలో పీకేఎం–1 రకం జూన్, జూలై మాసంలో నారు విడిగా పెంచుకొని నెల రోజుల మొక్కలు నాటుకొని సాగు చేసుకోవచ్చు.
ప్రశ్న: వర్షాభావ పరిస్థితిలో ఎలాంటి ప్రత్యామ్నాయ పంట వేసుకోవాలి?– ఎం. రమేశ్, నెక్కొండ
జవాబు: ప్రస్తుతం వాతావరణశాఖ సూచన మేరకు ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు కొంత ఆలస్యమవుతాయి. అవకాశం ఉన్నందున రైతులు నీటి లభ్యతను బట్టి పంటలు ఎంపిక చేసుకోవాలి. ముఖ్యంగా వరి వచ్చే నెల 15 తర్వాత నాటుకోకపోవడం మంచిది. అలాగే ప్రత్నామ్నాయంగా కందులు, పెసర్లు, బొబ్బర్లు, గోరు చిక్కుడు వంటి పంటలు సాగుచేస్తే మంచిది.
ప్రశ్న: మొక్కజొన్న సాగులో మెలకువలు సూచించండి?– కె.మోహన్‌రావు, వెంకటాపూర్, దుగ్గొండి
జవాబు: మొక్కజొన్న సాగుకు ముందు దుక్కి సిద్ధం చేసుకుని విత్తనాలు విత్తుకోవాలి. మూడు నుంచి నాలుగు దఫాలుగా కాంప్లెక్స్ ఎరువులను మొక్కకు అందించాలి. నీరు నిల్వ ఉండకుండా చూడాలి. తెగుళ్లను తట్టకోవడానికి భూమిలో ట్రైకోడెర్మా వీరిడేని వృద్ధి చేసి వర్మి కంపొస్ట్ చల్లుకోవాలి.
ప్రశ్న: పప్పు ధాన్యాల్లో వాడే జీవన ఎరువులేవి, ఎల్‌నినో ప్రభావంలో మిర్చి సాగు చేయచ్చా?
–(రైతులు వెంకటేశ్వర్లు పర్వతగిరి, ఎం.రాంబాబు ఖానాపూర్)
జవాబు: రైజోబియం 200, పాస్పోబ్యాక్టీరియా 200 గ్రాములు కలిపి ఒక ఎకరానికి సరిపడు విత్తనాలకు కలిపి విత్తన శుద్ధి చేయాలి. ఆ విత్తనాలను 24 గంటల లోపు విత్తుకోవాలి. నీటి వసతి కలిగి డ్రిప్ ద్వారా నీరు, ఎరువు ఇచ్చుకోగలిగితే మిర్చి సాగు చేసుకోవచ్చు.
అనుమతి ఉన్న డీలర్ల వద్దే కొనుగోలు చేయాలి
సాగులో యాజమాన్య పద్ధతులు పాటిస్తేనే దిగుబడి
సాక్షి ఫోన్‌ఇన్‌లో జిల్లా వ్యవసాయ అధికారి విజయ నిర్మల


