పేదల సొంతింటి కల సాకారం | - | Sakshi
Sakshi News home page

పేదల సొంతింటి కల సాకారం

Jun 18 2026 1:35 AM | Updated on Jun 18 2026 1:35 AM

ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌ రెడ్డి

సంగెం : కాంగ్రెస్‌ పాలనలోనే పేదల సొంతింటి కల సాకారమైందని ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌ రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని నాట్‌ విల్లింగ్‌ ఇచ్చిన వారి స్థానంలో 72 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మొదటి విడతలో మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తయిన తర్వాతనే రెండో విడతలో ఆయా గ్రామాలకు మంజూరు చేస్తామన్నారు. పేదల కళ్లల్లో ఆనందం నింపడమే లక్ష్యంగా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పనిచేస్తుందని వివరించారు. సంగెం మండలంలో మొదటి విడతలో 650 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశారమన్నారు. పార్టీకతీతంగా సంక్షేమ పథకాల అమలుతో నిరుపేదలకు ఆర్థిక భరోసా కలిగిస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ రాజ్‌కుమార్‌, ఎంపీడీఓ రవీందర్‌, హౌసింగ్‌ ఏఈ సాద్విక, సర్పంచ్‌ పేర్ల లలిత, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు ఇండ్ల రవికుమార్‌, నాయకులు మాధవరెడ్డి, రమేశ్‌ పాల్గొన్నారు.

బస్సు సర్వీస్‌ ప్రారంభం

కాంగ్రెస్‌ ప్రజా ప్రభుత్వం హయాంలోనే గ్రామ గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించి ప్రజా రవాణా సౌకర్యాన్ని మెరుగుపరిచామని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి అన్నారు. ఈ మేరకు సంగెం మండల పరిధిలోని కాట్రపల్లిలో బుధవారం ఆర్టీసీ బస్సును ప్రారంభించి ఎమ్మెల్యే మాట్లాడారు. వరంగల్‌ నుంచి ఖిలా వరంగల్‌, స్తంభంపల్లి, వసంతాపూర్‌, వంచనగిరి, శాయంపేట, టెక్స్‌టైల్‌ పార్కు మీదుగా సంగెం, కుంటపల్లి, కాట్రపల్లి వరకు బస్సు సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. ప్రజలకు మౌలిక వసతులు, ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్వయంగా ఆర్టీసీ బస్సును కాట్రపల్లి నుంచి సంగెం వరకు నడిపారు. మార్గమధ్యలో సంగెం మూలమలుపు వద్ద ఎదురుగా వస్తున్న కారు ఢీ కొట్టడంతో కారు స్వల్పంగా దెబ్బతింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement