వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్
వరంగల్ క్రైం: ప్రజల భద్రతే లక్ష్యంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నేరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ తెలిపారు. తమ పరిసరాల్లో ఎవరైనా గుర్తు తెలియని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మంగళవారం కాజీపేట రైల్వే స్టేషన్‌లో సీసీఎస్ పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అనుమానితుల గుర్తింపును పోలీస్ కమిషనర్ ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. నేరాలను అరికట్టేందుకు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా సీసీఎస్ పోలీసుల ఆధ్వర్యంలో రెండు బృందాలు వరంగల్ రైల్వే స్టేషన్‌లో, మరో రెండు బృందాలు కాజీపేట రైల్వే స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తనిఖీల సందర్భంగా సేకరించిన అనుమానితుల వివరాలను రికార్డుల రూపంలో భద్రపరుస్తున్నట్లు ఆయన తెలిపారు. తనిఖీల్లో క్రైమ్ అదనపు డీసీపీ బాలస్వామి, ఏసీపీ సదయ్య, జీఆర్పీ డీఎస్పీ కృపాకర్, సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ రాఘవేందర్, కాజీపేట ఇన్‌స్పెక్టర్ శ్యాంసుందర్, జీఆర్పీ ఇన్‌స్పెక్టర్ నరేశ్‌కుమార్, ఎస్‌ఐ అభినవ్‌తో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
లోక్ అదాలత్‌ను వినియోగించుకోవాలి..
రెండో జాతీయ మెగా లోక్ అదాలత్‌ను కక్షిదారులు వినియోగించుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్ అన్నారు. ఈనెల 20న జరిగే జాతీయ మెగా లోక్ అదాలత్‌కు సంబంధించి వరంగల్ కమిషనరేట్ పోలీసులు రూపొందించిన వాల్‌పోస్టర్లను వరంగల్ పోలీస్ కమిషనర్ మంగళవారం విడుదల చేశారు. కార్యక్రమంలో వెస్ట్ జోన్ డీసీపీ రాజమహేంద్రనాయక్, ట్రాఫిక్ అదనపు డీసీపీ రాయల ప్రభాకర్‌రావు, ఏసీపీ సత్యనారాయణ, పరకాల ఇన్‌స్పెక్టర్ క్రాంతికుమార్, దామెర ఎస్సై అశోక్ కుమార్ పాల్గొన్నారు.


