హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్
హన్మకొండ అర్బన్: ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని విజయవంతానికి బూత్ లెవల్ అధికారులు (బీఎల్‌ఓలు) కీలక పాత్ర పోషించాలని హనుమకొండ కలెక్టర్, ఈఆర్‌ఓ (వరంగల్ తూర్పు) చాహత్ బాజ్‌పాయ్ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్ష నిర్వహించారు. ఈనెల 17 నుంచి 20వ తేదీ వరకు జీడబ్ల్యూఎంసీ కౌన్సిల్ హాల్‌లో బూత్ లెవల్ అధికారులకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపారు. సమావేశంలో తహసీల్దార్లు మొహమ్మద్ ఇక్బాల్, శ్రీకాంత్, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ తదితరులు పాల్గొన్నారు.
కార్యక్రమాలు విజయవంతం చేయాలి
పల్స్ పోలియో, స్టాప్ డయేరియా క్యాంపెయిన్, జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమాలను అన్ని శాఖల సమన్వయంతో విజయవంతం చేయాలని కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా టాస్క్‌ఫోర్స్ సమావేశానికి అధ్యక్షత వహించిన కలెక్టర్, ఆయా కార్యక్రమాల అమలుపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రాం కుమార్, అదనపు కలెక్టర్ రవి, డీఆర్‌ఓ శ్రీనివాస్, జెడ్పీ సీఈఓ శేషాద్రి, జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి తదితరులు పాల్గొన్నారు.
అవార్డులతో జిల్లాకు గుర్తింపు
రాష్ట్ర రెడ్ క్రాస్ సొసైటీ ప్రకటించిన అవార్డుల్లో హనుమకొండ జిల్లా 8 అవార్డులను కై వసం చేసుకున్న సందర్భంగా సోమవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్‌ను రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర పాలక మండలి సభ్యులు ఈవీ.శ్రీనివాస్‌రావు కలిశారు. శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు, ఏసీపీలు, ఆర్డీఓలు, రెడ్ క్రాస్ ప్రతినిధులు పాల్గొన్నారు.
అట్రాసిటీ కేసుల పరిష్కారానికి ప్రత్యేక చొరవ
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల పరిష్కారాన్ని వేగవంతం చేసి బాధితులకు సత్వర న్యాయం అందేలా చర్యలు చేపట్టాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ విజిలెన్‌న్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో అదనపు కలెక్టర్ రవి, ఏఎస్పీలతో కలిసి కలెక్టర్ కేసుల పురోగతిని సమీక్షించారు. సమావేశంలో జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి, జిల్లా ఎస్సీ కార్పొరేషన్ అధికారి సురేశ్ కుమార్, ఏసీపీలు ప్రశాంత్‌రెడ్డి, నరసింహారావు, ఆర్డీఓలు వెంకటేశ్, వెంకన్న, తహసీల్దార్ సీహెచ్.రాజు, ఎన్జీఓ ప్రతినిధులు డాక్టర్ పి.దామోదర్, పురుషోత్తం, నరసింహారావు, ఈవీ శ్రీనివాస్, విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.


