హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్
హన్మకొండ అర్బన్: ప్రజావాణిలో అందిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ అధికారులను ఆదేశించారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి అందిన దరఖాస్తుల నమోదు, పరిష్కార ప్రక్రియపై కలెక్టర్ సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. కాగా, మొత్తం 263 దరఖాస్తులు అందినట్లు అధికారులు తెలిపారు. జిల్లా పరిధి హనుమకొండ, పరకాల రెవెన్యూ డివిజన్ కార్యాలయాల్లో నిర్వహించిన ప్రజావాణిలో ఆర్డీఓలు, సంబంధిత అధికారులు ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రవి, జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాస్, జెడ్పీ సీఈఓ శేషాద్రి, అధికారులు పాల్గొన్నారు.
వరంగల్‌లో..
న్యూశాయంపేట: అర్జీలను పరిష్కరించాలని వరంగల్ కలెక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌లో మొత్తం 202 దరఖాస్తులు నమోదయ్యాయని ఆమె తెలిపారు. రెవెన్యూ 64, మున్సిపల్ 48, హౌసింగ్ 22, డీఆర్‌డీఓ 10, ఇతర శాఖలకు సంబంధించి 58 దరఖాస్తులు వచ్చాయని కలెక్టర్ పేర్కొన్నారు. కాగా, వరంగల్ హెడ్‌పోస్టాఫీస్ పక్కన ఉన్న మున్సిపల్ కార్పొరేషన్ ఖాళీ స్థలంలో ట్రాఫిక్‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మేం వ్యాపారాలు చేసుకుంటామని వీధి వ్యాపారులు కలెక్టర్‌కు విన్నవించారు.అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వైవీ గణేశ్, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీఆర్‌ఓ విజయలక్ష్మి, డీఎంహెచ్‌ఓ సాంబశివరావు పాల్గొన్నారు.


