నర్సంపేట: సమీపంలోనే కెనాల్ ఉండగా మరో కెనాల్ నిర్మిస్తే విలువైన భూములు కోల్పోతామని నల్లబెల్లి మండలం కన్నారావుపేట రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు కన్నారావుపేట సర్పంచ్ పలనాటి మూర్తి ఆధ్వర్యంలో సోమవారం రైతులు నర్సంపేట ఆర్డీఓకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ కన్నారావుపేట గ్రామంలో రంగాయ చెరువు రిజర్వాయర్ నుంచి రైట్ కెనాల్ ద్వారా తమ భూములకు నీరందుతూ చెరువులు, కుంటలు నిండుతున్నాయని తెలిపారు. అయినప్పటికీ రైతుల భూములను చీల్చుతూ మరో కెనాల్ ఉందని నీటి పారుదల శాఖ అధికారులు పదేపదే చెప్పడంతో ఉపాధి పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల కోరిక మేరకు గత ప్రభుత్వ హయాంలో కెనాల్ పనులు నిలిపివేశారని, ఇప్పుడు మళ్లీ తెరపైకి రావడం భయభ్రాంతులకు గురిచేస్తోందని వాపోయారు. రైతులను నష్టపరిచే కెనాల్ వద్దని అధికారులను కోరారు. కార్యక్రమంలో రైతులు నానబోయిన దేవేందర్, అశోద శరత్, కృష్ణారెడ్డి, సంపత్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, కరుణాకర్‌రెడ్డి, బద్రి, రాజేందర్, యాకూబ్, దేవేందర్‌రెడ్డి, సహదేవ్, చంద్రశేఖర్ పాల్గొన్నారు.
మొహర్రానికి
ఏర్పాట్లు చేయాలి
న్యూశాయంపేట: మొహర్రంను ప్రశాంతంగా నిర్వహించేందకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ మాట్లాడుతూ ఊరేగింపునకు ముందస్తు ఏర్పాట్లు చేయాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా చూడాలని పోలీసు అధికారులకు సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వైవీ గణేశ్, డీఆర్‌ఓ విజయలక్ష్మి, మైనారిటీ సంక్షేమాధికారి టి.రమేశ్ పాల్గొన్నారు.
‘సర్వోదయ’ సేవలు అభినందనీయం
గీసుకొండ: మహిళల సంక్షేమం, జీవనోపాధి, వ్యాపారాభివృద్ధి కోసం సర్వోదయ యూత్ ఆర్గనైజేషన్ చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని మామునూరు ఏసీపీ ఎన్.వెంకటేశ్ అన్నారు. కొనాయమాకులలో సోమవారం నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మహిళలు చట్టాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సర్వోదయ సంస్థ కార్యదర్శి డాక్టర్ పల్లెపాడు దామోదర్ మాట్లాడుతూ తమ సంస్థ 30 ఏళ్ల నుంచి సుమారు 5 వేల మంది మహిళలు, వితంతువులకు వడ్డీలేని రుణాలను అందించిందని వివరించారు. సెర్ప్ ఏపీఎం ముక్కెర ఈశ్వర్ మాట్లాడుతూ సర్వోదయ సంస్థ మహిళల ఆర్థికాభివృద్ధికి రుణాలు అందించడం గొప్ప విషయం అన్నారు. అనంతరం సర్వోదయ సంస్థ ఆధ్వర్యంలో 30 మంది పేద మహిళలకు రూ.20 వేల చొప్పున రూ.6 లక్షల వడ్డీలేని రుణాలను పంపిణీ చేశారు. సంస్థ ప్రాజెక్టు మేనేజర్ కవిరాజు, ప్రతినిధులు ఇందిర, రవీందర్, అక్తర్, వనిత, గీసుకొండ, సంగెం, ఆత్మకూరు మండలాల మహిళలు పాల్గొన్నారు.


