నెక్కొండ: పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏటా ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న వనమహోత్సవానికి జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. అన్ని శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనే లక్ష్యంతో నర్సరీలు, మొక్కలు నాటే ప్లాంటేషన్ సైట్లను అధికారులు పర్యవేక్షిస్తున్నారు. వానలు ప్రారంభం కావడంతో నర్సరీల్లో పెంచిన మొక్కలను నాటేందుకు అధికారులు, గ్రామ పంచాయతీల సిబ్బంది ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
నర్సరీల పెంపకం ఇలా..
జిల్లాలోని 327 నర్సరీలు ఏర్పాటు చేసి 25.51 లక్షల మొక్కలు పెంచుతున్నారు. ఉపాధి హామీ, పంచాయతీరాజ్, అటవీశాఖ అధికారుల పర్యవేక్షణలో నర్సరీలు కొనసాగుతున్నాయి. ప్రతి సంవత్సరం వర్షాకాలం సీజన్‌లో మొక్కలు నాటి రెండేళ్లపాటు పర్యవేక్షిస్తున్నారు.
ఒక్కో నర్సరీలో
5 వేల నుంచి 8 వేల మొక్కల పెంపకం
ఈ ఏడాది జనవరి నుంచే ఉపాధి హామీ పథకం కింద ప్రతి గ్రామ పంచాయతీ నర్సరీలో మొక్కల పెంపకానికి శ్రీకారం చుట్టారు. ఈ సారి ఎండల తీవ్రత అధికంగా ఉన్నా నర్సరీల నిర్వాహకులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. చలువ పందిళ్లు ఏర్పాటు చేసి మొక్కలను ఎండదెబ్బ నుంచి కాపాడగలిగారు. ప్రస్తుతం ఒక్కో నర్సరీలో 5 వేల నుంచి 8 వేల వరకు మొక్కలు పెంచుతున్నారు.
ఇంటింటికీ పంపిణీ..
జాన్, జూలైలో పెద్ద ఎత్తున మొక్కలను నాటడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కాల్వల గట్ల వెంట, గుట్టలు, రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటాలని అధికారులు భావిస్తున్నారు. ప్రతి ఇంటికి 5 నుంచి 6 మొక్కలు పంపిణీ చేయాలని ఆయా గ్రామాల సర్పంచ్‌లు, కార్యదర్శులు నిర్ణయించారు. ఈసారి నర్సరీల్లో పండ్లు, పూలు, నీడనిచ్చే మొక్కల పెంపకానికి అధికారులు ప్రాధాన్యం ఇచ్చారు.
ప్రతీ మొక్కను సంరక్షిస్తాం..
వనమహోత్సవంలో భాగంగా మొక్కలు నాటేందుకు ఇప్పటికే ప్రణాళికలు రూపొందించాం. జిల్లాలోని 327 నర్సరీల్లో 25.5 లక్షల మొక్కలు పెంచుతున్నాం. నాటిన ప్రతీ మొక్కను సంరక్షించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధుల సహకారంతో వనమహోత్సవ లక్ష్యాన్ని పూర్తిచేస్తాం. – నాగపద్మజ, డీఆర్‌డీఓ
వర్షాలు కురవగానే మొక్కలు నాటేందుకు ప్రణాళికలు
327 నర్సరీల్లో 25.51 లక్షల మొక్కల పెంపకం


