నర్సంపేట: ఒకటి కాదు..రెండు కాదు.. ఏకంగా 15 సంవత్సరాలుగా పేరుకుపోయిన చెత్త సమస్యకు నర్సంపేట మున్సిపాలిటీ పాలకవర్గం శ్రీకారం చుట్టింది. గ్రామ పంచాయతీ నుంచి నగర పంచాయతీగా ఆపై మున్సిపాలిటీగా అభివృద్ధి చెందుతూ అన్ని రంగాల్లో ముందుకు సాగుతున్న నర్సంపేట మున్సిపాలిటీలో చెత్త సమస్య మాత్రం పీడిస్తూ వచ్చింది. ప్రస్తుతం 30 వార్డులు, 60 వేల జనాభా కలిగిన నర్సంపేట పట్టణం జిల్లా కేంద్రంగా చెప్పుకునేందుకు ద్వితీయ స్థానంలో నిలిచింది. ఇలాంటి మున్సిపాలిటీలో చెప్పుకునేందుకు డంపింగ్ యార్డు లేకపోవడం అందులోనూ పేరుకుపోయిన చెత్తను తగ్గించే అవకాశం లేకపోవడంతో గుట్టలు గుట్టలుగా ఏర్పడింది. రాష్ట్రంలోనే కాదు.. దేశంలోనే ప్రఖ్యాతిగా కాలుష్యరహిత ప్రాంతంగా పేరొందిన పాకాల సరస్సుకు వెళ్లే రహదారిపై చెత్త డంప్ నిల్వ చేస్తుండడంతో ఆవైపుగా వెళ్లే పర్యాటకులకు అసహనం కలిగించింది. ప్రస్తుత ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ద్వారా చెత్త గుట్టలను శుద్ధి చేస్తూ కాలుష్య నివారణకు శ్రీకారం చుట్టారు.
నర్సంపేట పట్టణంలో 20 రోజులుగా పేరుకుపోయిన చెత్త గుట్టలను శుద్ధీకరణ చేసేందుకు అన్నపూర్ణ కన్‌స్ట్రక్షన్ సంస్థ ఉద్యోగులు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సహకారంతో ముందుకు సాగారు. సంస్థ ఉద్యోగులు జనవరిలో నర్సంపేట పట్టణంలోని పాకాల రోడ్డు వెంట ఉన్న డంపింగ్ యార్డును సందర్శించారు. దుర్వాసన రాకుండా పనులు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసి కార్మికుల ఆరోగ్యంపై ప్రభావం పడకుండా అప్పటికప్పుడే రసాయనాలను స్ప్రే చేశారు. దాని తర్వాత బయోమైనింగ్ పనులకు అవసరమైన పరికరాలలో భాగంగా వే బ్రిడ్జి నిర్మించి 63 కేవీ విద్యుత్ నియంత్రణ ప్రోమో యంత్రాన్ని అమర్చి వేర్వేరు హెచ్‌పీల సామర్థ్యం కలిగిన ఏడు కరెంటు విద్యుత్ మోటార్లను బిగించి 20 రోజులుగా కొనసాగుతున్న ఈ ప్రక్రియ మరో మూడు పాటు కొనసాగించనున్నారు.
రోజుకు 450 టన్నుల చెత్త శుద్ధీకరణ
నర్సంపేట పట్టణంలో పేరుకుపోయిన చెత్తను పాకాల రోడ్డులోని అసైన్డ్ భూమిలో పోస్తూ వస్తున్నారు. ప్రస్తుతం 13 వేల నుంచి 16 వేల మెట్రిక్ టన్నుల చెత్త పేరుకుపోయి ఉంటుంది. గత నవంబర్‌లో టెండర్‌లు పిలువగా నిర్మల్‌కు చెందిన అన్నపూర్ణ కన్‌స్ట్రక్షన్ సంస్థ పనులను దక్కించుకుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో నర్సంపేటతో పాటు పరకాల, వర్ధన్నపేట మున్సిపాలిటీల్లో బయోమైనింగ్ పనులు ఆ సంస్థ దక్కించుకుంది. అయినప్పటికీ నర్సంపేటలో మాత్రమే పనులు మొదలయ్యాయి.
బయోమైనింగ్ విధానంలో..
నర్సంపేట పట్టణంలో పేరుకుపోయిన చెత్తను పాకాల రోడ్డు వెంట ఉన్న అసైన్డ్ భూమిలో డంప్ చేయగా 15 సంవత్సరాలుగా పేరుకుపోయిన ఈ చెత్త గుట్టలను బయోమైనింగ్ విధానంలో శుద్ధి చేస్తున్నారు. రోజుకు 450 టన్నుల చెత్త శుద్ధీకరణ జరుగుతున్నట్లు ప్రస్తుతం అక్కడ ఇన్‌చార్జ్‌గా ఉన్న సూపర్‌వైజర్ కుమార్ సాక్షికి తెలిపారు. ప్రొక్‌లైనర్‌తో ప్రోమో యంత్రంతో చేయగానే అందులో నుంచి మూడు విభాగాలుగా ప్లాస్టిక్ పరికరాలు, చెత్త, మట్టిని కుప్పలుగా పోస్తుందని, టన్ను చెత్త నుంచి 60శాతం బయో సాయిల్స్, 20శాతం ఇన్‌నర్స్ (5ఎంఎం కంటే ఎక్కువ సైజ్ రాళ్లు, సీసా ముక్కలు), 10 శాతం రిజెక్ట్ మెటీరియల్ (ప్లాస్టిక్), 10 శాతం తరుగు (లెస్) చొప్పున శుద్ధీకరణ అవుతుందన్నారు.
మంచి పనులకు శ్రీకారం చుట్టాం
గత కొన్ని సంవత్సరాలుగా నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో పేరుకుపోయిన చెత్త డంపింగ్ యార్డును బయో మైనింగ్ ద్వారా శుద్ధీకరణ చేసేందుకు శ్రీకారం చుట్టాం. పర్యావరణ పరంగా పాకాల అభివృద్ధిని ఆకాంక్షిస్తూనే ఆ మార్గం గుండా వెళ్లే పర్యాటకులకు అసౌకర్యాలను తొలగించేందుకు డంప్ యార్డులో బయోమెట్రిక్ సిస్టం ద్వారా శుద్ధీకరణకు శ్రీకారం చుట్టాం. నర్సంపేట నియోజకవర్గంతో పాటు మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే ఆకాంక్షతో కృషి చేస్తున్నాం.
– దొంతి మాధవరెడ్డి, ఎమ్మెల్యే నర్సంపేట
ఎమ్మెల్యే సహకారంతో..
పర్యావరణ పరంగా అన్ని రకాలుగా నర్సంపేట పట్టణాన్ని ముందు ఉంచేందుకు కృషి చేస్తున్నాం. మౌలిక సదుపాయల కల్ప నకు అనునిత్యం అన్ని రకాల సమస్యలను పరిష్కరిస్తూ కావాల్సిన నిధుల కోసం ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సహకారాన్ని తీసుకుంటూ జిల్లాలోనే నర్సంపేట మున్సిపాలిటీని అగ్రగామిగా నిలిపేందుకు ముందుకు సాగుతున్నాం.
–పెండెం లక్ష్మీరామానంద్, మున్సిపల్ చైర్‌పర్సన్
ఆధునిక టెక్నాలజీతో వ్యర్థాల నిర్వహణ
రోజుకు 450 టన్నుల శుద్ధీకరణ
పట్టణంలో సరికొత్త పారిశుద్ధ్య విప్లవం
తరుగుతున్న చెత్త గుట్టలు


