చెన్నారావుపేట: మండలపరిధిలోని అక్కల్‌చెడ గ్రామంలో మిషన్ భగీరథ పైపులైన్ లీకై మూడు రోజులైంది. స్థానిక సర్పంచ్ సంబంధిత అధికారులకు సమస్యను వివరించిన పైపులైన్ మరమ్మతు పనులు పూర్తి కాలేదు. దీంతో తాగునీటి కోసం ప్రజలు అవస్థలు పడుతున్నారు. సర్పంచ్ బుజ్జి తాత్కాలికంగా ట్యాంకర్ ద్వారా నీరందించడంతో ప్రజలు కనీస అవసరాలు తీర్చుకుంటున్నారు.
నేడు కలెక్టరేట్‌లో గ్రీవెన్స్
న్యూశాయంపేట: కలెక్టరేట్, రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా నలుమూలల వచ్చే ప్రజల సమస్యల పరిష్కారం కోసం అర్జీలు స్వీకరించనున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు.
గ్రేటర్ వరంగల్‌లో..
వరంగల్ అర్బన్: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్(జీడబ్ల్యూఎంసీ) ప్రధాన కార్యాలయ కౌన్సిల్ హాల్‌లో సోమవారం గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు అదనపు కమిషనర్ ఇసంపెల్లి జోనా ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు రాత పూర్వకంగా దరఖాస్తులు అందజేయాలని కోరారు. సమస్యల పరిష్కారానికి గ్రీవెన్స్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.
అరటి తోటల పరిశీలన
దుగ్గొండి: మండలంలోని లక్ష్మీపురం గ్రామంలో రెండు రోజుల క్రితం కురిసిన గాలివాన బీభత్సానికి అరటి తోటలు పెద్ద ఎత్తున దెబ్బతిన్నాయి. ఈ మేరకు దెబ్బతిన్న అరటి తోటలను జిల్లా ఉద్యానశాఖ అధికారి శ్రీనివాస్ ఆదివారం పరిశీలించారు. నష్టాన్ని అంచనా వేశారు. నష్టపోయిన రైతులను అధైర్య పడవద్దని దైర్యం చెప్పారు. అనంతరం ఆయన మాట్లాడారు. చేతికి వచ్చే దశలో పంట ప్రకృతి విలయతాండవానికి దెబ్బతినడం బాధాకరమన్నారు. నష్టం వివరాలను నివేదిక రూపంలో ప్రభుత్వానికి అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ఉద్యానశాఖ అధికారి జ్యోతి, సర్పంచ్ కన్నం అలీమా చిరంజీవి, రైతులు లడె యుగందర్, సురేందర్, వంశీ, నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.
వరంగల్ చౌరస్తా: పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం (ఎస్‌జీపీఏటీ) రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి వెలిశోజు రామమనోహర్ డిమాండ్ చేశారు. వరంగల్ గిర్మాజీపేటలోని సరస్వతి విద్యానికేతన్ పాఠశాలలో ఎస్‌జీపీఏటీ కాశిబుగ్గ యూనిట్ సమావేశం ఎండీ మదార్ సాహెబ్ అధ్యక్షతన ఆదివారం జరిగింది. ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. హెల్త్ కార్డులకు సంబంధించి విధివిధానాలు లేకుండా, వైద్యశాలల ఎంపిక జరుగకుండా, పెన్షనర్లకు సమాచారం లేకుండా ప్రీమియం మినహాయించడం శోచనీయమన్నారు. పెన్షనర్ల బకాయిలు వెంటనే చెల్లించాలని, ప్రస్తుతం రిటైర్ అవుతున్నవారికి రిటైర్మెంట్ రోజే అన్ని రకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. నాయకులు సుధీర్‌బాబు, తుమ్మ వీరయ్య, గునిగంటి సాంబయ్య, నిమ్మకాయల సదానందం, మధుసూదన్ రావు, వీరస్వామి, కుమారస్వామి, భిక్షపతి, ఎన్.సత్యనారాయణ, పెద్దూరి పెద్దన్న, చంద్రమౌళి పాల్గొన్నారు.
కాశిబుగ్గ: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో 478 మంది నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకు 161 మంది ఇన్‌పేషంట్లకు సేవలందించడం సమస్యగా మారింది. రెండు వార్డులకు కలిపి ఒక నర్సింగ్ ఆఫీసర్‌తో సేవలందించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఈక్రమంలో అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలోని నర్సింగ్ ఆఫీసర్లను డిప్యుటేషన్‌పై ఎంజీఎం ఆస్పత్రికి పంపించారు. అలాగే, నర్సింగ్ స్కూల్‌కు చెందిన వందలాది మంది విద్యార్థినులను కూడా నర్సింగ్ ఆఫీసర్లకు అసిస్టెంట్లుగా ఉండేందుకు ఏర్పాట్లు చేశారు. నర్సింగ్ ఆఫీసర్ల సమస్య తీరాలంటే చాలా సమయం పట్టే అవకాశం ఉంది. కొత్తవారు జాయిన్ అయితేనే నర్సింగ్ సేవలు సజావుగా అందుతాయి. ఇప్పటికే ఎంజీఎంలో సూపరింటెండెంట్ పోస్టు భర్తీ కాకపోవడం, నర్సింగ్ సిబ్బంది జాయిన్ కాకపోవడం అధికారులకు తలనొప్పిగా మారింది.


