రేపటినుంచి స్కూళ్లలో బ్రేక్‌ఫాస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

రేపటినుంచి స్కూళ్లలో బ్రేక్‌ఫాస్ట్‌

Jun 14 2026 11:49 AM | Updated on Jun 14 2026 11:49 AM

రేపటినుంచి స్కూళ్లలో బ్రేక్‌ఫాస్ట్‌

విద్యారణ్యపురి: ఈ విద్యాసంవత్సరం (2026–2027)లో ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్‌ కళాశాలల్లో విద్యార్థులకు అల్పాహారం (బ్రేక్‌ఫాస్ట్‌) అందజేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించినప్పటికి తొలిదశలో కొన్నింటిలోనే అమలు చేయనున్నారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లా పరిధి అర్బన్‌ ప్రాంతాలైన హనుమకొండ జిల్లాలోని రెండు మండలాలు, వరంగల్‌ పరిధి ఏడు మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో రీ ఓపెనింగ్‌రోజు (ఈనెల 15) నుంచి అమలుచేసేందుకు అంతా సిద్ధం చేశారు. ఇక్కడి ఫలితాలను బట్టి దశలవారీగా మిగతా పాఠశాలల్లో అమలు చేస్తారని భావిస్తున్నారు.

ప్రార్థన సమయంకంటే ముందుగానే..

ఎంపిక చేసిన పాఠశాలల్లో ఈనెల 15నుంచి ప్రార్థన సమయం కంటే ముందుగానే అంటే ఉదయం 8–30గంటలకే విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్‌ అందించనున్నారు. ప్రభుత్వం అప్పగించిన సొసైటీ సిబ్బంది ఆ సమయం కంటే ముందుగానే పాఠశాలల్లో అందుబాటులో ఉంచుతారు. అందుకు ఒక గదిని ప్రత్యేకంగా కేటాయించుకోవాలి. బ్రేక్‌ఫాస్ట్‌ విద్యార్థులకు అందించేలా చూసేందుకు ఒక టీచర్‌కు ఇన్‌చార్జ్‌ బాధ్యతలు అప్పగించాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ నవీన్‌ నికోలస్‌, మధ్యాహ్నభోజన పథకం అమలు ఇన్‌చార్జ్‌ రమణకుమార్‌ ఆయా డీఈఓలు, ఎంఈఓలను ఆదేశించారు. ఈ మేరకు హైదరాబాద్‌ నుంచి శనివారం నిర్వహించిన జూమ్‌ మీటింగ్‌లో పలు సూచనలు చేశారు.

ప్రారంభోత్సవానికి ప్రజాప్రతినిధులు..

పాఠశాలల పునఃప్రారంభం రోజున ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ పథకం అమలు ప్రారంభోత్సవానికి స్థానిక ప్రజాప్రతినిధులను ఆహ్వానించాలని నవీన్‌ నికోలస్‌ ఆదేశించారు. హనుమకొండ, కాజీపేట మండలాల్లోని రెండు స్కూళ్ల చొప్పున ప్రారంభోత్సవ కార్యక్రమం చేపట్టాలని ఆదేశించారు. జూమ్‌ మీటింగ్‌లో డీఈఓలు ఎల్‌వీ గిరిరాజ్‌ గౌడ్‌, రంగయ్యనాయుడు ఎంఈఓలు నెహ్రూ, బి.మనోజ్‌కుమార్‌, ఎ.శ్రీనివాస్‌, పాల్గొన్నారు.

విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి

హనుమకొండ, కాజీపేట మండలాల్లోని 86 పాఠశాలల్లో ఈనెల 15నుంచి అమలుచేయనున్న బ్రేక్‌ఫాస్ట్‌ను విద్యార్థులకు అందించేలా ఏర్పాట్లు పూర్తిచేశాం. విద్యార్థులు సక్రమంగా పాఠశాలలకు హాజరై దీనిని సద్వినియోగం చేసుకోవాలి. దీనివల్ల విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టడంతోపాటు ఆలస్య హాజరు సమస్య కూడా తీరుతుంది.

– ఎల్‌వీ గిరిరాజ్‌గౌడ్‌, డీఈఓ, హనుమకొండ

మొదట అమలుచేసే పాఠశాలలు..

జిల్లా పాఠశాలలు విద్యార్థులు

హనుమకొండ 86 9,490

వరంగల్‌ 300 20,995

మొదట అర్బన్‌ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లోనే..

హనుమకొండ జిల్లాలోని 2,

వరంగల్‌లోని 7 మండలాల్లోనే..

దశలవారీగా మిగతా పాఠశాలల్లో అమలుకు చర్యలు

డీఈఓ, ఎంఈఓలు పర్యవేక్షించాలి

రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ ఆదేశాలు

హనుమకొండ జిల్లాలో..

జిల్లాలో 14 మండలాలు ఉండగా, హనుమకొండ మండలంలోని 49 (పీఎస్‌, యూపీఎస్‌, హైస్కూల్స్‌) పాఠశాలల్లో ప్రీప్రైమరీ నుంచి 10వ తరగతి వరకు ప్రస్తుతం 5,648మంది విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్‌ అమలుచేయనున్నారు. కాజీపేట మండలంలోని 37 పాఠశాలల్లో 3,842మంది విద్యార్థులు ఉన్నారు. అదేవిధంగా జిల్లాలోని మూడు జూనియర్‌ కళాశాల(హనుమకొండ కో ఎడ్యుకేషన్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, వడ్డేపల్లి పింగిళి ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, ఒకేషనల్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల)ల్లో అమలుకు చర్యలు తీసుకుంటున్నారు. వీటిలో ప్రస్తుతం 3,786మంది విద్యార్థులుండగా, అడ్మిషన్ల సంఖ్య పెరిగితే వారికి కూడా బ్రేక్‌ఫాస్ట్‌ అందజేస్తారు.

వరంగల్‌ జిల్లాలో..

వరంగల్‌ జిల్లాలో 13 మండలాలు ఉండగా మొదటగా ఏడు (వరంగల్‌, గీసుకొండ, సంగెం, ఖిలావరంగల్‌, వర్ధన్నపేట, నల్లబెల్లి, దుగ్గొండి) మండలాల్లోని 300 ప్రభుత్వ పాఠశాలల్లో బ్రేక్‌ఫాస్ట్‌ ఇవ్వనున్నారు. వీటిలో 20,995 మంది విద్యార్థులు ఉన్నారు.

రోజువారీ మెనూ ఇలా..

సోమవారం: దోశలు (2), చట్నీ సాంబారు

మంగళవారం: మిల్లెట్‌ ఇడ్లి (2), సాంబారు

బుధవారం: పూరి (2), మిక్స్‌డ్‌ వెజిటేబుల్‌ కుర్మా

గురువారం: బోండా (2), చట్నీ/సాంబారు

శుక్రవారం: రెండు ఇడ్లీ, చట్నీ/సాంబారు

శనివారం: ఉప్మా, చట్నీ/సాంబారు

సోమ, బుధ, శుక్రవారం ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌,పాలు

మంగళ, గురు, శనివారం రాగిజావ

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement