గాలివాన బీభత్సం | - | Sakshi
Sakshi News home page

గాలివాన బీభత్సం

Jun 14 2026 11:49 AM | Updated on Jun 14 2026 11:49 AM

లక్ష్మీపురంలో నేలవాలిన అరటితోటలు

రోడ్డుకు అడ్డంగా పడిన వృక్షాలు

దుగ్గొండి: మండలంలోని పలు గ్రామాల్లో శుక్రవారం రాత్రి కురిసిన గాలివాన బీభత్సం సృష్టించింది. దుగ్గొండి, నాచినపల్లి, తొగర్రాయి గ్రామాల్లో ప్రధాన రహదారులపై భారీ వృక్షాలు కూలిపోయాయి. విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఆయా గ్రామాల సర్పంచ్‌లు డోజర్ల సాయంతో చెట్లు తొలగించారు. లక్ష్మీపురం గ్రామానికి చెందిన లడె సాంబయ్య, లడె యుగేంధర్‌, సురేందర్‌, మోర్తాల వంశీ సాగుచేసిన 16 ఎకరాల అరటి తోటల్లో గెలలు రాలిపోయాయి. ఒక్కో రైతుకు రూ.3 లక్షల ఆస్తినష్టం వాటిల్లింది. దెబ్బతిన్న అరటి పంటలను నర్సంపేట డివిజన్‌ ఉద్యానశాఖ అధికారి జ్యోతి శనివారం పరిశీలించారు. రైతులకు ధైర్యం చెప్పి, నష్టం అంచనాను ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. తొగర్రాయి గ్రామానికి చెందిన బుసాని నరేశ్‌ ఇంటి రేకులు ఎగిరిపోయాయి. ఇంట్లోని టీవీ, ఫ్రిజ్‌, సామగ్రి ధ్వంసమయ్యాయి. గాలివాన సమయంలో నరేశ్‌ కుటుంబ సభ్యులు బయటకు వచ్చి ప్రాణాలు కాపాడుకున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు కోరారు.

రాయపర్తి మండలంలో..

రాయపర్తి: మండలంలోని గ్రామాల్లో శుక్రవారం రాత్రి, శనివారం కురిసిన గాలివానకు పలు ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. రహదారులపై చెట్లు కూలి వాహదారులు ఇబ్బందులు పడ్డారు. విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగింది. ఇళ్లు కూలి పోరున బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని తెట్టెకుంటతండా, కాట్రపల్లి గ్రామాల సర్పంచ్‌లు ఇస్లావత్‌ సంతోష్‌నాయక్‌, రాపాక పద్మ కోరారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement