ఘనంగా శివకల్యాణం, శని పూజలు | - | Sakshi
Sakshi News home page

ఘనంగా శివకల్యాణం, శని పూజలు

Jun 14 2026 11:49 AM | Updated on Jun 14 2026 11:49 AM

ఘనంగా శివకల్యాణం, శని పూజలు 17న భద్రకాళి ఆలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ఠ

హన్మకొండ కల్చరల్‌: వేయిస్తంభాల ఆలయంలో శనివారం త్రయోదశిని పురస్కరించుకుని శివకల్యాణం, శనీశ్వరుడికి ఘనంగా పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో వేదపండితులు మణికంఠశర్మ, అర్చకులు సందీప్‌శర్మ, ప్రణవ్‌ ఉదయం 5 గంటల నుంచి సుప్రభాతసేవ, మూల గణపతికి ఆరాధన, రుద్రేశ్వరస్వామికి ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. మాస శివరాత్రిని పురస్కరించుకుని శివపార్వతులకల్యాణం ఘనంగా నిర్వహించారు. అనంతరం శని త్రయోదశిని పురస్కరించుకుని శనీశ్వర ఉత్సవ మూర్తిని నువ్వులనూనెతో సామూహిక తైలాభిషేకం నిర్వహిస్తూ భక్తులకు గ్రహదోష, కాలసర్పదోష నివారణ జరగాలని, భక్తుల గోత్రనామాదులతో నవగ్రహపూజలు, తిలతర్పణాలు, వస్త్రాదానాలు చేశారు. ఆలయ ఈఓ అనిల్‌కుమార్‌ పర్యవేక్షించారు.

హన్మకొండ కల్చరల్‌: భద్రకాళి ఆలయంలో ఈనెల 17న నూతనంగా తయారు చేసిన ధ్వజస్తంభ ప్రతిష్ఠ జరుగుతుందని భద్రకాళి ఆలయ ఈఓ రామల సునీత, ప్రధానార్చకుడు భద్రకాళి శేషు శనివారం ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. ఆలయ ధ్వజస్తంభ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమం మూడు రోజుల పాటు నిర్వహించనున్నట్లు, ఈమేరకు జూన్‌ 15న సోమవారం నుంచి పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయని తెలిపారు. జూన్‌ 17న బుధవారం ఉదయం 8.36 గంటలకు కర్కాటక లగ్నంలో జరిగే ప్రతిష్ఠాపనోత్సవంలో జగద్గురు పుష్పగిరి శంకరాచార్య మహా సంస్థాన పీఠాధీశ్వరులు శ్రీశ్రీవిద్యాశంకర భారతీస్వామి పాల్గొని ధ్వజస్తంభ ప్రతిష్ఠ నిర్వహిస్తారని తెలిపారు. అదేవిధంగా దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ, వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి పాల్గొంటారని తెలిపారు. ధ్వజప్రతిష్ఠ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.

ఖానాపురంలో చోరీ

ఖానాపురం: మండల కేంద్రంలో శుక్రవారం రాత్రి చోరీ జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రంలోని రామాలయం వీధికి చెందిన తూడి సత్తయ్య ఇంట్లో కుడికాల వెంకటలక్ష్మి అద్దెకు ఉంటోంది. ఈ క్రమంలో వెంకటలక్ష్మి శుక్రవారం రాత్రి బంధువుల ఇంటికి వెళ్లింది. అంతకు ముందే సత్తయ్య కుటుంబ సభ్యులు సైతం బంధువుల ఇళ్లకు వెళ్లారు. గుర్తు తెలియని వ్యక్తులు శుక్రవారం రాత్రి సత్తయ్య ఇంట్లో చోరీకి యత్నించగా ఎలాంటి నగదు, ఆభరణాలు లభించలేదు. పక్కనే కిరాయికి ఉండే వెంకటలక్ష్మి ఇంట్లో పావుతులం బంగారం, 10 తులాల వెండి, రూ.5వేల నగదు అపహరించుకెళ్లారు. అనంతరం పక్కనే ఉన్న చలిగంటి కుమారస్వామి ఇంట్లో సైతం చోరీకి యత్నించగా ఎలాంటి సొత్తు లభించకపోడంతో వెనుదిరిగారు. ఎస్సై రామ్మోహన్‌ వివరాలు సేకరించారు. దుగ్గొండి సీఐ సాయిరమణ, ఫింగర్‌ప్రింట్స్‌ విభాగం సీఐ రాజ్‌కుమార్‌, కానిస్టేబుళ్లు అనిల్‌, రమేశ్‌, సీసీఎస్‌ ఎస్సై తిరుపతి, హెచ్‌సీ మున్నా వేలిముద్రలు సేకరించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement