‘ప్రీప్రైమరీ’లో ఉద్యోగాల భర్తీ | - | Sakshi
Sakshi News home page

‘ప్రీప్రైమరీ’లో ఉద్యోగాల భర్తీ

Jun 12 2026 7:25 AM | Updated on Jun 12 2026 7:25 AM

ఇన్‌స్ట్రక్టర్‌, ఆయా పోస్టులకు

దరఖాస్తుల ఆహ్వానం

ఈనెల 19 సాయంత్రం 4 గంటల వరకు గడువు

కాళోజీ సెంటర్‌: జిల్లా వ్యాప్తంగా ఎంపిక చేసిన 48 పాఠశాలల్లో ఈ సంవత్సరం ప్రీ ప్రైమరీ తరగతులను అధికారులు ప్రారంభించనున్నారు. బోధన చేయడానికి ప్రీ ప్రైమరీ ఇన్‌స్ట్రక్టర్‌, ఆయా పోస్టుల భర్తీకి అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి బి.రంగయ్యనాయుడు తెలిపారు. ఈ విద్యా సంవత్సరం చివరి వరకు తాత్కాలిక ప్రాతిపదికన మాత్రమే నియామకాలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు.

అర్హతలు..

ఇన్‌స్ట్రక్టర్‌ పోస్టులకు అభ్యర్థులు ఇంటర్మీడియట్‌ (10+2) ఉత్తీర్ణులై ఉండాలి. డిప్లొమా ఇన్‌ ప్రీ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ (డీపీఎస్‌ఈ), నర్సరీ టీచర్‌ ఎడ్యుకేషన్‌, కనీసం రెండేళ్ల కాలపరిమితి గల ఎర్లీ చైల్డ్‌ హుడ్‌ ఎడ్యుకేషన్‌ ప్రోగ్రాం (డీఈసెడ్‌) లేదా బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ (నర్సరీ) చేసిన వారికి ఎంపికలో ప్రాధాన్యం ఉంటుంది. నెల గౌరవ వేతనం రూ.8 వేలుగా నిర్ణయించారు. ఆయా పోస్టులకు ఏడో తరగతి పాసైన మహిళలు అర్హులు. వీరికి నెల గౌరవ వేతనం రూ.6వేలు చెల్లిస్తారు.

వయోపరిమితి..

దరఖాస్తుదారుల వయస్సు 18 నుంచి 44 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ మహిళా అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఎక్స్‌ సర్వీస్‌ పర్సన్లకు 3 సంవత్సరాలు, దివ్యాంగ మహిళలకు 10 సంవత్సరాల సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం..

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే మహిళలు తప్పనిసరిగా ఆయా గ్రామ పంచాయతీ లేదా మున్సిప ల్‌ డివిజన్‌ పరిధిలోనే నివాసం ఉండాలి. స్థానికత, అభ్యర్థుల మెరిట్‌ ఆధారంగానే ఎంపిక చేస్తారు.

దరఖాస్తు చేసేవిధానం..

అర్హత, ఆసక్తి గల మహిళా అభ్యర్థులు పూర్తి వివరాలతో కూడిన దరఖాస్తులకు విద్యార్హత పత్రాల (ఇంటర్‌/ఏడో తరగతి మెమోలు) రెండు సెట్ల జిరాక్స్‌ ప్రతులను జతచేసి సంబంధిత మండల విద్యాశాఖాధికారి (ఎంఈఓ) కార్యాలయంలో ఈనెల 19వ తేదీ సాయంత్రం నాలుగు గంటల్లోపు సమర్పించాలి. దరఖాస్తు చేసే సమయంలో అభ్యర్థులు తమ ఒరిజినల్‌ సర్టిఫికెట్లను వెంట తీసుకురావాలని అధికారులు సూచించారు.

48 పాఠశాలల్లో నియామకం

జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక (ప్రీప్రైమరీ) తరగతుల నిర్వహణకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఎంపిక చేసిన 48 పాఠశాలల జాబితా ఆయా మండల కార్యాలయాల్లో అందుబాటులో ఉంది. విద్యాశాఖ అభ్యర్థులను ఎప్పుడైనా ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా తొలగించే సర్వహక్కులు ఉంటాయనే విషయాన్ని అభ్యర్థులు గమనించాలి.

– బి.రంగయ్యనాయుడు, డీఈఓ

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement