హన్మకొండ : మండుటెండ నుంచి చిరుజల్లులతో కొంత ఉపశమనం కలిగింది. ఉక్కపోతతో సతమతమవుతున్న ప్రజలకు బుధవారం కురిసిన తేలిక పాటి వర్షంతో కాస్త చల్లదనం లభించింది. మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత అధికంగా ఉండగా, సాయంత్రం పూట ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. ఆకాశం మేఘావృతమై కొన్ని ప్రాంతాల్లో స్వల్పవర్షం కురిసింది. చిరు జల్లులతో పరిసరాలు తడవడంతో, వేడిగాలుల తీవ్రత తగ్గి చల్లటి వాతావరణం నెలకొంది. హనుమకొండ, వరంగల్ జిల్లాలో పలు ప్రాంతాల్లో చిరు జల్లులు పడ్డాయి. రాత్రి 8 గంటల వరకు హనుమకొండ జిల్లాలోని ధర్మసాగర్‌లో 16.8 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. చింతగట్టులో 3.5 మిల్లీ మీటర్లు, గీసుకొండలో 2 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. వరంగల్ జిల్లా చెన్నారావుపేటలో 4 మిల్లీ మీటర్లు, రెడ్లవాడలో 2.8 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. వరంగల్ మహానగరంలోను చినుకులు పడడంతో వాతావరణం చల్లబడింది. మరో రెండు రోజుల పాటు ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.
రైతుల ఆందోళన..
వర్షంతో కొందరు రైతులు ఆందోళన చెందుతున్నారు. ధాన్యం కొనుగోళ్లు పూర్తి కాకపోవడం, వర్షాకాలం సమీపించి చిరు జల్లులు పడుతుండడంతో తడిసి నష్టపోతామనే భయం రైతుల్లో నెలకొంది. ధాన్యం కొనుగోళ్లు వేగంగా చేయకపోవడంతో రైతులు నష్టపోయే ప్రమాదముంది.


