ఖిలా వరంగల్ : ప్రమాదవశాత్తు రైలు నుంచి జారిపడి ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన బుధవారం తెల్లవారుజామున వరంగల్ జీఆర్పీ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఇంటికన్నె– నెక్కొండ రైల్వేస్టేషన్ల మధ్య చోటు చేసుకుంది. జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ సుదర్శన్ వివరాలు వెల్లడించారు. వ్యక్తి మృతి చెందినట్టు సమాచారం అందడంతో విచారణ చేపట్టామన్నారు. మృతదేహాన్ని వరంగల్ నగరంలోని ఎంజీఎం ఆస్పత్రి మార్చురీలో భద్రపర్చామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. వివరాలకు 97017 47014, 87126 58627 నంబర్లలో సంప్రదించా లని సుదర్శన్ సూచించారు.
వ్యక్తి అదృశ్యం
ఖిలా వరంగల్ : మిల్స్‌కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి అదృశ్యమైన ఘటన చోటు చేసుకున్నట్లు ఇన్‌స్పెక్టర్ బొల్లం రమేశ్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. బుధవారం ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లిన సముద్రాల సంపత్ సాయంత్రమైనా తిరిగి ఇంటికి చేరుకోలేదు. ఫ్యామిలీ గ్రూపులో వాయిస్ మెసేజ్ చేశాడు. తన చావుకు అతడి సోదరుడే కారణమంటూ రాసి పంపించాడు. ఎంత వెతికినా అతడి ఆచూకీ లభించకపోవడంతో సముద్రాల రజిత ఫిర్యాదు మేరకు వ్యక్తి అదృశ్యమైనట్టు కేసు నమోదు చేసినట్లు దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ రమేశ్ వివరించారు.
తూర్పుకోటను అభివృద్ధి చేయాలి
ఖిలా వరంగల్ : తూర్పుకోటను అభివృద్ధి చేయాలని బీజేపీ నాయకుడు కందిమల్ల మహేశ్ కోరారు. వరంగల్ 37వ డివిజన్ తూర్పుకోట ఎస్సీ కాలనీలో బుధవారం ఆయన పర్యటించారు. అధ్వానమైన రోడ్లు, డ్రెయినేజీలు, తాగునీటి పైపులైన్లను పరిశీలించి ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు అవుతున్నా తూర్పుకోట ఎస్సీవాడపై సరైన దృష్టి పెట్టలేదని విమర్శించారు.
టిప్పర్ డ్రైవర్‌పై కేసు
ఖిలా వరంగల్ : కరీంనగర్‌కు చెందిన కర్ణకంటి శ్రీనివాసచారి కారులో ఖమ్మం దిశగా వెళ్తుండగా వరంగల్‌లోని ఆర్టీఏ జంక్షన్‌లో ఆయన కారును టిప్పర్ బలంగా ఢీకొట్టింది. ప్రయాణికులు క్షేమంగా బయటపడినా కారు ధ్వంసమైంది. శ్రీనివాసచారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ బొల్లం రమేశ్ తెలిపారు.


