సాక్షి, వరంగల్: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్)కు ముందస్తు సన్నాహల్లో భాగంగా జిల్లాలో చేపడుతున్న మ్యాపింగ్ ఈ నెల 18వ తేదీనాటికి 71.49 శాతమే పూర్తయింది. మరో 40 రోజుల్లో ఎస్‌ఐఆర్ సర్వే ప్రారంభం కానున్న నేపథ్యంలో అప్పటివరకు ఈ ప్రక్రియ పూర్తి చేసే దిశగా అధికారులు కసరత్తు ముమ్మరం చేశారు. ఇప్పటివరకు ఎస్‌ఐఆర్ మ్యాపింగ్ ప్రక్రియ విధానంలో వరంగల్ జిల్లా 24వ స్థానంలో ఉండడంతో సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసేలా కలెక్టర్ సత్యశారద చొరవ తీసుకుంటున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మహబూబాబాద్, జనగామ జిల్లాలు ముందుండడంతో వరంగల్‌లో కూడా వేగం పెంచారు. 2025 ఓటర్ల జాబితా ప్రకారం మొత్తం 7,80,310 మంది ఓటర్లు ఉండగా ఇప్పటివరకు 5,57,855 మంది ఓటర్లకు మ్యాపింగ్ చేశారు. మరో 2,22,455 మంది ఓటర్లకు మ్యాపింగ్ చేయాల్సి ఉంది. జిల్లాలోని నియోజకవర్గాల వారీగా మ్యాపింగ్ ప్రక్రియ నర్సంపేట, వర్ధన్నపేట కాస్త ముందుండగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలో సగం మాత్రమే మ్యాపింగ్ జరగడం గమనార్హం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చివరిసారిగా 2002లో ఎస్‌ఐఆర్ సర్వేను చేపట్టారు. అప్పటి ఓటర్ల జాబితాలో, 2025 జాబితాలోనూ ఉన్న ఓటర్ల పేర్లను గుర్తిస్తూ బీఎల్‌ఓలు ఇంటింటికి వెళ్లి మ్యాపింగ్ చేపడుతున్నారు. ఇందులో భాగంగా మృతి చెందినవారు, ఇళ్లు మారి వేరే ప్రాంతాలకు వెళ్లిన వారు, ఇతర నకిలీ ఓట్లను గుర్తిస్తున్నారు. నగరాలు, పట్టణ ప్రాంతాల్లో మ్యాపింగ్ ప్రక్రియ నత్తనడకన జరుగుతోంది.
ధ్రువపత్రాలు సమర్పించాల్సిందే..
2002, 2025 ఓటర్ల జాబితాల్లో (రెండింటిలో) పేర్లు నమోదైనవారిని కేటగిరి ఏలో.. 2002 ఓటర్ల జాబితాలో పేర్లు లేకుండా ఉండి.. 1987 జూలై ఒకటి కంటే ముందు జన్మించిన వారిని బీ కేటగిరి కింద, 1987 నుంచి 2004 సంవత్సరాల మధ్య జన్మించిన వారిని సీ కేటగిరి కింద, 2004 సంవత్సరం తర్వాత జన్మించిన వారిని డీ కేటగిరిగా విభజించి ఎస్‌ఐఆర్‌లో పేర్లు నమోదు చేస్తున్నారు. అయితే కేటగిరి ఏ కింద 1,82,309 మంది మాత్రమే ఉంటే.. బీ, సీ, డీ కేటగిరిల కింద 5,98,001 మంది ఉన్నట్లు గుర్తించారు. ఇప్పటివరకు 5,57,855 మంది ఓటర్ల మ్యాపింగ్ జరగ్గా మిగిలిన వాటిని కూడా సాధ్యమైనంత తొందరగా పూర్తి చేసే దిశగా అధికారులు పనిచేస్తున్నారు. అయితే 2002, 2025 రెండు ఓటర్ల జాబితాలోనూ పేర్లు ఉంటే ఓటర్లు ఆధారాల కోసం ఎలాంటి ధ్రువపత్రాలు సమర్పించాల్సిన అవసరం లేదు. ఇలాంటివారు ఇప్పటి వరకు 1,82,309 మంది ఉన్నారు. అయితే ప్రస్తుతం జరుగుతున్న మ్యాపింగ్‌లో ధ్రువపత్రాలు సమర్పించాల్సిన ఓటర్లు 5,98,001 ఉన్నారని తెలిసింది. వీరు కేంద్ర ప్రభుత్వం పేర్కొన్న 11 గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి సమర్పించాల్సి ఉంది.
జిల్లాలో కొనసాగుతున్న ఓటర్ల మ్యాపింగ్
రాష్ట్రంలో 24వ స్థానంలో వరంగల్
ముందున్న నర్సంపేట, వర్ధన్నపేట నియోజకవర్గాలు
54.51 శాతంతో వెనుకబడిన
వరంగల్ తూర్పు..
నగరంలో అందుబాటులో లేని ఓటర్లు
కలెక్టర్ సత్యశారద ప్రత్యేక దృష్టి
సారించడంతో వేగిరం
నియోజకవర్గం మొత్తం ఓటర్లు మ్యాపింగ్ ఓటర్లు శాతం
నర్సంపేట 2,40,245 2,05,412 85.50
వరంగల్ తూర్పు 2,62,707 1,43,213 54.51
వర్ధన్నపేట 2,77,358 2,09,230 75.44
మొత్తం 7,80,310 5,57,855 71.49


