చెన్నారావుపేట: మండల కేంద్రంలోని రాజస్తాన్ స్వీట్ షాప్‌ను జిల్లా గెజిటెడ్ ఫుడ్ ఇన్‌స్పెక్టర్ కృష్ణమూర్తి మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మిఠాయిల నాణ్యతను పరిశీలించారు. శాంపిల్ సేకరించారు. షాప్ పరిసరాలు పరిశుభ్రంగా లేకపోవడం, మిఠాయిల్లో కలర్ ఎక్కువగా ఉందనే కారణంతో నోటీస్‌లు జారీ చేశారు.
నర్సంపేట నుంచి
యాదగిరిగుట్టకు బస్సు సర్వీస్
నర్సంపేట: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నర్సంపేట డిపో నుంచి ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్టకు నేడు(బుధవారం) నుంచి ప్రతీ రోజు ఉదయం 5గంటలకు, మధ్యాహ్నం 12గంటలకు ఎక్స్‌ప్రెస్ బస్సు సర్వీస్ ప్రారంభించనున్నట్లు డిపో మేనేజర్ ప్రసూనలక్ష్మి తెలిపారు. ఈ మేరకు డిపో కార్యాలయంలో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిపో మేనేజర్ ప్రసూనలక్ష్మి మాట్లాడుతూ.. నర్సంపేట పట్టణ, పరిసర ప్రాంత ప్రయాణికులు ఈ అకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.
దాడి చేసిన ఆరుగురిపై కేసు నమోదు
సంగెం : వ్యక్తిపై దాడి చేసిన ఆరుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వంశీకృష్ణ మంగళవారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కృష్ణానగర్ గ్రామానికి చెందిన పేర్ల క్రాంతి కుమార్ వరంగల్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా క్రాస్ రోడ్ వద్ద అదే గ్రామానికి చెందిన గోపతి శ్రీకాంత్ ఆపి దాడి చేశాడు. ఆ తర్వాత గ్రామానికి వెళ్లగా సుబ్బారావు ఇంటి సమీపంలో శ్రీకాంత్‌తో పాటుగా మేకల నరేష్, వంగ కుమారస్వామి, పేర్ల లక్ష్మణ్, పేర్ల రాజ్‌కుమార్‌లు దాడి చేశారు. ఆపడానికి వచ్చిన పేర్ల కుమారస్వామిపై గోపతి యాదగిరి గొడ్డలికామతో దాడి చేయగా తలకు రక్త గాయమైంది. క్రాంతి కుమార్ ఫిర్యాదుతో నిందితులు శ్రీకాంత్, నరేష్, కుమారస్వామి, లక్ష్మణ్, రాజ్‌కుమార్, యాదగిరిలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వంశీకృష్ణ తెలిపారు.
అనుమానాస్పద స్థితిలో జింక మృతి
గీసుకొండ: మండలంలోని ఊకల్ క్రాస్‌రోడ్డు– గీసుకొండ రహదారిలో గోదాముల పక్కన ఖాళీ స్థలంలో మచ్చల జింక మృతదేహం మంగళవారం లభ్యమైంది. అనుమానాస్పద స్థితిలో జింక మృతి చెంది ఉండటంతో పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. దూర ప్రాంతం నుంచి వచ్చి ఎండ వేడిమికి తట్టుకోలేక మృత్యువాత పడిందా.. లేదా.. ఏదైనా జూ పార్క్ నుంచి తప్పిపోయి వచ్చిందా..? అనే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. స్థానికుల సమాచారం మేరకు అటవీశాఖ సెక్షన్ ఆఫీసర్ జగ్గయ్య, బీట్ ఆఫీసర్ సమ్మయ్య ఘటనా స్థలానికి చేరుకుని జింక కలేబరాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కాగా గతంలో కొన్ని సంవత్సరాల క్రితం కొనాయమాకుల పంచముఖ ఆంజనేయస్వామి ఆలయం సమీపంలో వరంగల్–నర్సంపేట రహదారి పక్కన ఇలాగే మృతి చెందిన ఓ జింక మృతదేహం లభ్యమైంది.
ఎయిర్‌పోర్ట్ అభివృద్ధికి టెండర్ల ఆహ్వానం
మామునూరు: వరంగల్ మామునూరు విమానాశ్రయం అభివృద్ది పనుల కోసం అధికారులు టెంబర్లను ఆహ్వానించినట్లు తెలిసింది. ఎయిర్‌పోర్ట్ అథారిటీ అధికారులు ఇటీవల పర్యటించిన విషయం తెలిసిందే. భూ నిర్వాసితుల నుంచి సేకరించిన రన్‌వే స్థలానికి పెన్షింగ్, బోర్డులు ఏర్పాటు, ప్రాంగణంలోని ఏపుగా పెరిగిన ముళ్లపొదలు, ఇతర చెట్ల తొలగింపు, విమానాశ్రయంలో భూసార పరీక్షలకు అధికారులు ప్రణాళి క సిద్ధం చేసినట్లు సమాచారం. రూ.20 లక్షల కేటాయించగా 180 రోజుల్లో పర్యావరణ అనుమతులు, భూసార పరీక్షలు నిర్వహించేందుకు టెండర్‌దారులనుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిసింది. కాగా టెండర్ల దాఖలుకు మంగళవారం సాయంత్రం 4గంటల వరకు చివరి అవకాశం ఉన్నట్లు సమాచారం. టెండర్లను 20న సాయంత్రం 5 గంటలకు ఫైనల్ చేయనున్నట్లు తెలుస్తోంది. పనులను దక్కించుకునే కాంట్రాక్టర్ 180 రోజుల్లో అభివృద్ధి పనులు పూర్తి చేయాల్సి ఉంటుందని అఽధికారులు చెబుతున్నారు.


