● కలెక్టర్ సత్యశారద
న్యూశాయంపేట: జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధి, ఉపాధి అవకాశాల పెంపుకోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. జిల్లాలోని వివిధ రంగాలకు చెందిన ఉత్పత్తుల ఎగుమతి అవకాశాలు, అవసరమైన పరిశ్రమల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, వ్యాపార విస్తరణపై మంగళవారం కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. స్థానిక ఉత్పత్తులను జాతీయ, అంతర్జాతీయ మార్కెట్‌లకు చేరవేసే దిశగా సమన్వయంతో పనిచేయాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. సమావేశంలో ఇండస్ట్రీయల్ జీఎం నరసింహమూర్తి, జోనల్ మేనేజర్ స్వామి, ఎల్‌డీఎం హవేలి రాజు, సదానందం, ఏడీ రమేష్, చైతన్యరవి, రవిశంకర్, శ్రీనాథారెడ్డి పాల్గొన్నారు.
స్కిల్ డెవలప్‌మెంట్‌పై అవగాహన
ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా కలెక్టరేట్‌లో యూత్ అండ్ స్పోర్ట్స్ వారోత్సవాల్లో రెండో రోజు కెరీర్ గైడ్ అండ్ స్కిల్ డెవలప్‌మెంట్‌పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇండస్ట్రీయల్ జీఎం నర్సింహమూర్తి పాల్గొని విద్యార్థులకు కెరీర్ గైడెన్స్, స్కీల్ డెవలప్‌మెంట్‌పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సత్యశారద మాట్లాడుతూ.. ప్రస్తుతం మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్‌లో 3,400 ఉద్యోగాల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నామని తెలిపారు. ఈ నియామక ప్రక్రియ డీఆర్‌డీఏ జీఎం. ఇండస్ట్రియల్, కేఎంటీపీ జోనల్ మేనేజర్ ఆధ్వర్యంలో జరుగుతుందన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వై.వి.గణేష్, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, పశుసంవర్థకశాఖ జేడీ. బాలకృష్ణ, పురావస్తు శాఖ ఏడీ బుజ్జి, యూత్ ఆఫీసర్ అనిల్ పాల్గొన్నారు.


