● వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ వీరన్న
గీసుకొండ: రైతులు మోతాదుకు మించి ఎరువులను వాడొద్దని, భూమికి మేలు చేసే సమతుల్య ఎరువులను వాడాలని పత్తి ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ జి.వీరన్న అన్నారు. మండలంలోని ధర్మారంలో మంగళవారం నిర్వహించిన రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమంలో ఆయన రైతులకు పలు సూచనలు చేశారు. పంట మార్పిడి పద్ధతులు పాటిస్తే మేలన్నారు. మార్కెట్ డిమాండ్ ఆధారంగా పంటలను ఎంపిక చేసుకుని సాగు చేయడం లాభదాయకంగా ఉంటుందన్నారు. వరి శాస్త్రవేత్త డాక్టర్ గోన్యానాయక్ మాట్లాడుతూ.. వానాకాలంలో రైతులు మేలైన రకం వరి విత్తనాలను ఎంపిక చేసుకోవాలన్నారు. గీసుకొండ ఏఓ హరిప్రసాద్‌బాబు మాట్లాడుతూ.. హెచ్‌టీబీటీ విత్తనాలను ప్రభుత్వం నిషేధించిందని, వాటిని కొన్నా, అమ్మినా, సాగు చేసినా చట్టరీత్యా చర్యలు ఉంటాయని తెలిపారు. ఏఈఓ కావ్య, రైతులు కొట్టె ముత్తిలింగం, గోదాసి లింగమూర్తి, గౌరయ్య, రాజయ్య పాల్గొన్నారు.


