మాజీ నక్సలైట్‌నని.. | - | Sakshi
Sakshi News home page

మాజీ నక్సలైట్‌నని..

May 20 2026 10:25 AM | Updated on May 20 2026 10:25 AM

సూర్యాపేట టౌన్‌: తాను మాజీ నక్సలైట్‌నని ఓ వ్యక్తి నేరుగా సూర్యాపేట జిల్లా ఎస్పీ వద్దకు లొంగిపోయేందుకు వచ్చాడు. రాయపర్తి మండలంలోని ఊకల్‌ గ్రామానికి చెందిన పెద్దోజు దేవేంద్రచారి అలియాస్‌ జగన్‌ మంగళవారం ఎస్పీ నరసింహ ఎదుట లొంగిపోయేందుకు వచ్చాడు. అనుమానం వచ్చిన పోలీసులు అతడి రికార్డులు, నేర చరిత్రను ఆరా తీశారు. సదరు వ్యక్తి చెబుతున్న వివరాలు పొంతన లేకపోవడం, పోలీసు రికార్డుల్లో ఎక్కడా అతడి పేరు లేకపోవడంతో అనుమానం వ్యక్తం చేశారు. పూర్తి సమాచారం కోసం దేవేంద్రచారిని హైదరాబాద్‌ ఇంటలిజెన్స్‌ కార్యాలయానికి తరలించామని, విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెబుతున్నారు.

నాలుగేళ్లుగా

పాతర్లపహాడ్‌లో నివాసం..

దేవేంద్రచారి నాలుగేళ్లుగా సూర్యాపేట జిల్లా ఆత్మకూరు (ఎస్‌) మండలం పాతర్లపహాడ్‌ గ్రామంలో నివాసముంటున్నట్టు చెబుతున్నాడు. అక్కడే తన అక్కబావ జూలూరి లలిత, సుధాకర్‌ వద్ద ఉంటూ కార్పెంటర్‌గా పని చేస్తున్నట్టు మీడియాకు తెలిపాడు. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం పామెడు మండలం ధర్మారం గ్రామానికి చెందిన సునీత అనే మహిళతో తనకు వివాహం జరిగిందని, నలుగురు సంతానం ఉన్నట్టు చెప్పాడు. ఛత్తీస్‌గఢ్‌లోని ధర్మారంలో ఉన్న భార్య తరఫున బంధువులు ఒకరు మరణించడంతో సోమవారం తాను అక్కడికి వెళ్లగా ఆ సమయంలో స్థానికులు తనను గుర్తుపట్టి.. పాత నక్సలైట్‌ రికార్డుల నేపథ్యంలో అక్కడి పోలీసులకు సమాచారం అందించినట్లు చెప్పాడు. అక్కడి నుంచి తప్పించుకుని ఇక్కడికి చేరుకున్నానని, ఎస్పీ ముందు లొంగిపోయేందుకు వచ్చినట్టు దేవేంద్రచారి చెప్పాడు.

లొంగిపోయేందుకు వచ్చిన వ్యక్తి..

పోలీస్‌ రికార్డుల్లో లేని పేరు

హైదరాబాద్‌లోని ఇంటలిజెన్స్‌

కార్యాలయానికి తరలింపు

Advertisement
 
Advertisement
Advertisement