నర్సంపేట : ప్రభుత్వం బెస్త, గంగపుత్ర కులాలను అధికారికంగా ప్రకటించాలని గంగపుత్ర సంఘం పట్టణ అధ్యక్షుడు గుంటి సంజీవ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆర్డీఓకు మంగళవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంజీవ మాట్లాడుతూ.. బెస్త, గంగపుత్ర కులస్తులను ఈ మధ్య ప్రకటించిన సమగ్ర సర్వేలో ప్రభుత్వం జనాభా లెక్కల్లో చూపించలేదన్నారు. బెస్త, గంగపుత్ర కులాలు ఉప కులాలు కాదని గుర్తు చేశారు. గంగపుత్రులం చేపలు పట్టుకొని జీవించే వారమని, అనాదిగా తమది ఇదే వృత్తి అన్నారు. తెలంగాణలో ఐదు, ఆరు లక్షల జనాభా ఉన్న గంగపుత్రులను చూపెట్టకపోవడం బాధాకరం అన్నారు. బీసీ–డీలో ఉన్న ముదిరాజ్‌లను బీసీ–ఏలో కలపడానికి ప్రభుత్వ ప్రయత్నాలను వ్యతిరేకిస్తున్నామన్నారు. ముదిరాజులను బీసీ–ఏలోకి వస్తే బీసీ–ఏలో ఉన్న 57కులాల వారి పాత్రినిఽథ్యం కోల్పోతారని, ఉనికి లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే బీసీ–ఏలో ఉన్న కులాలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదరణ లేకుండా వెనుకబడి ఉన్నామని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ప్రభుత్వం తన నిర్ణయం వెనక్కి తీసుకోకపోతే బీసీ–ఏ కులాలు భారీ ఎత్తున ధర్నాకు దిగుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు ఎర్రబోయిన కిషన్, జీజుల సాగర్, చింతల టార్జాన్, అంకాల మల్లికార్జున్, అంకాల సురేష్, పూస ఏకాంబరం, మేదరబోయిన శ్రీనివాస్, కాపరబోయిన రమేష్, గుంటి రమేష్, అంబటి సంజీవ పాల్గొన్నారు.


